‘‘ఏదిరా శీనూ నా పావలా?’’‘‘............’’‘‘ఎప్పుడిస్తావురా ? బాకీ తీర్చవేటి?’’‘‘..........’’‘‘ఎప్పుడనగా ఇచ్చేన్రా పావలా? ఆర్నెల్ల పొద్దైంది...’’‘‘.............’’‘‘తెగ తిప్పిస్తన్నావు.. అసలిస్తావా ? లేదా ?’’‘‘............’’‘‘మట్టిబుక్కడం లా మాట్లాడవేంరా ? ఇయ్యకపోతే ఇయ్యనని చెప్పీ... నా జేబీకి బొక్కపడి జారిపోయిందనుకుంటాను. అంతేగానీ, ఇస్తానిస్తానంటూ ఉత్తికుత్తినే తలూపీకు.

ఎగ్గోట్టీయాలనుకుంటే సుబ్బరంగా చెప్పీ. మరడగను...’’బెలగాం హైస్కూల్ ఏడో క్లాస్ ‘ఎ’ సెక్షన్ లో ప్రభాకర్ కీ, ‘బి’ సెక్షన్ లో శీనుబాబుకీ మధ్య రోజూ ఇదే గోల...బెలగాంసెంటర్ కి తూర్పున నాయుడి వీధిలోని శ్రీరామమూర్తి మాస్టారి రెండో అబ్బాయి ప్రభాకర్ కి, పడమటన అగ్రహారం వీధి లాయర్ లక్ష్మాజీరావుగారి ఆరో అబ్బాయి శీనుబాబు ఆర్నెల్ల క్రితం- ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1964 ఆగస్టు లో పావలా బాకీ పడ్డాడు. 1965 ఫిబ్రవరి కావస్తునా బాకీ తీరలేదు. దాని కోసం ప్రభాకర్ గుర్తు చెయ్యని రోజు లేదు. రోజుకి కనీసం మూడుసార్లు పనిగట్టుకుని వెంటబడేవాడు. అదెలా అంటే..ఆ రోజుల్లో ఉదయాన్నే తొమ్మిదిగంటలకి ప్రేయర్ బెల్ కొట్టగానే, ఆరుబయట జెండాకొయ్య దగ్గర హెడ్ మాస్టారు నేరెళ్ళ సుబ్బారావుగారికి ఎదురుగా పిల్లలంతా బారులు తీరేవారు.

ఏడో క్లాస్ ‘ఎ’సెక్షన్ వరసలోని ప్రభాకర్ ఒడుపు చూసుకుని పక్కనే ‘బి’సెక్షన్ వరసలోని శీనుబాబు తాలూకు చొక్కాకాలరు పట్టుకు లాగేవాడు. శీనుబాబుకి అర్థమైపోయేది. ఆ రోజుకి అది మొదటి హెచ్చరిక. ఆ తర్వాత ఇంటర్వెల్‌లో పిల్లలంతా స్కూలు వెనక కాంపౌండ్ వాల్ దగ్గర చింతచెట్లకిందకి వెళ్ళేవారు. అక్కడ శీనుబాబుని నిలదీసి, చొక్కాజేబులూ, నిక్కరుజేబులూ తడిమేవాడు ప్రభాకర్. అది రెండో హెచ్చరిక.

అక్కడితో ఐపోలేదు. నాటి చివరిహెచ్చరిక సాయంత్రం వెలువడేది. ‘బి’ సెక్షన్ నుంచి శీనుబాబు బయటకు రాగానే ప్రభాకర్ వెంబడించేవాడు. మైదానం వీధివైపు గోడమీంచి దూకి ఇంటికి వెళ్ళిపోయేముందు- పెన్నుపాళీ తోనో, పెన్సిలుముల్లుతోనో శీనుబాబుని గుచ్చి, ముచ్చమ్మా మూడసారి పావలాబాకీ గురించి కొంచెం పదునుగా జ్ఞాపకం చేసేవాడు. ఎప్పటిలాగే శీనుబాబు తలూపేవాడు. నీ పావలా ఇచ్చేస్తానులేరా అని మెల్లగా చెప్పేవాడు. మళ్ళీ మర్నాడు మామూలే!