‘‘బాలత్రిపుర సుందరీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువైయున్న శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కళ్యాణ మహోత్సవము. కార్యక్రమం: ఉదయం 6 గంటలకు స్వామి వారికి క్షీరాభిషేకం, తదుపరి అలంకారం, అర్చన. రాత్రి 8 గంటలకు చర్మ చిత్రకళా ప్రదర్శన (తోలు బొమ్మలాట). భక్తు లెల్లరూ పాల్గొని స్వామి వారి కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరు. ఇట్లు, ధర్మకర్త.’’కరపత్రం చదువుకుంది వసుధ. క్రిందటేడు తన భర్త ఉత్సవాలని ఎంత ఉత్సాహంగా నడిపించిందీ గుర్తు కొచ్చిందామెకు. ఉత్సవాలే కాదు దేవాలయంలో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం దేవస్థానం వేద పండితుడిగా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ వుంటుంది. మూడు పదుల వయసుకే వేదాధ్యయనం పూర్తి చేసి, ఆగమ శాస్త్రంలో అపార పాండిత్యం సంపాదించిన తన భర్త అంటే ధర్మకర్త గారికీ, ఊళ్లో వారికీ గౌరవం, భక్తి ప్రపత్తులూనూ. వారి ధర్మపత్నిగా తాను కూడా ఆ గౌరవంలో పాలు పంచుకుంటున్నందుకు, భర్త సేవతోబాటు భగవత్సేవ చేసుకునే భాగ్యం కూడా కలిగినందుకు వసుధ సంతోషపడని రోజు లేదు.‘‘వసూ! నిన్ను వొంటరిగా వదిలి వెడుతున్నాను.
నెలల పిల్లాడితో ఎలా వేగుతావో ఏమో. నీకు తెలుసు, మరొకటీ మరొకటీ అయితే వెళ్లే వాడిని కాదు. పుష్కరానికో మాటు జరుగుతాయి ఈ సపరికర అద్వైత వేదాంత మహాసభలు. కాశీలో విశ్వేశ్వరుడి సన్నిధిలో ఇవి జరగడం, నాకు ఆహ్వానం రావడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. పది రోజుల్లో వచ్చేస్తాను. నువు ధైర్యంగా ఉండు. అవసరమైతే పక్కింటి వాళ్ల పిల్లలెవర్నైనా తోడు పడుకో బెట్టుకో. చంటాడు జాగ్రత్త.’’ అంటూ తన భర్త కాశీ వెడుతూ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంది వసుధ.అప్పుడే పాలు తాగి నిద్రపోతున్న కొడుకుని ముద్దాడబోయి, నిద్రపోతున్న పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదని తన తల్లి చెప్పింది గుర్తు కొచ్చి ఆగింది. పిల్లవాడి జుట్టు కళ్లల్లోకి పడకుండా పైకి తోసి, తన చేతి వేళ్లని ముద్దు పెట్టుకుంది.్‌్‌్‌షష్ఠి రోజున గుమ్మం లోపల కూర్చుని తీర్థానికి పొరుగూళ్ల నుంచి వచ్చిపోతున్న జనాలని చూడ సాగింది వసుధ. ఇంతలో ఒకామె చంకలో పిల్ల నెత్తుకుని గుమ్మం ముందుకొచ్చి నిలబడింది.‘‘దణ్ణాలమ్మా. తోలు బొమ్మలాట వాళ్లం. ఆలయం వెనక తోటలో బస చేశాం. రాత్రి కిక్కడ ఆట కదా. తెర కట్టడానికి రెండు తెల్ల చీరలిప్పించండమ్మా. ఆట అయిపోగానే భద్రంగా తెచ్చిస్తా.’’ అంది దణ్ణం పెడుతూ. ఆమె చెబుతూవుంటే మాట తొణగనీయకుండా ఆమె ఎత్తుకున్న బిడ్డ గుక్క పట్టి ఏడుస్తోంది.