తూరుపుకనుమల్లో దోరశి ప్రత్యేకమైన ప్రదేశం. మినుములూరు దాటి, పాడేరు గడచి, మత్స్యగుండం చేరేవరకూ కానవస్తాయి దోరశి భూములు. ఆరుదల నేలలు, గెడ్డల పుణ్యమాని, వానల ధర్మమాని పంటలు బాగా పండుతాయి. అన్నంకుంభాలు, కూరలకుండలు దొంతులుగా పేర్చుకోగలిగేటంతటి పోషకారం, పచ్చని ఈ ప్రాంతాన వెలసినవే బొంకులమావిళ్లు.
గుత్తులపుట్టు గ్రామపొలిమేరలు దాటాక ఎదురవుతాయి. అందానికి అందం. ఆహారానికి ఆహారం. ప్రేయసీప్రియుల విహారానికి వీరవిహారం. ఇలాంటి తోపుల్లోకి ఎప్పటికైనా పెళ్లాం మెరియతో కలిసి పోవాలని, అక్కడే దానితో కలగలిసిపోవాలని బగ్గడికి మహాకోరిక.మెరియ అచ్చమైన అందాలగొంది. పుట్టింది గంపరాయిలో. అది తొలిముట్టు అయ్యాక ఊరివాగు ఒడ్డున రేవుతొక్కే పండగ ఘనంగా జరిగింది. నాటినుంచీ పెళ్లి సంబంధాలు వచ్చిపడుతూనే ఉండేవి. ఎవరెవరో ఏవేవో దేశాలనుంచి పారొచ్చేవారు. కల్లుదిప్పలతో దిగేవారు. శతమానాలు తెచ్చేవారు. పాదుకోడిని చంకనబెట్టుకుని వచ్చేవారు. తూతుగొమ్ము ఊదుకుంటూ విచ్చేసేవారు. దాన్నిస్తే చాలనేవారు. అయినా అది ఒప్పేది కాదు. పోగాపోగా కన్నవారికి అసలు సంగతిని అదే ఓనాడు చెప్పింది.అమ్మాబాబులు వీరంగం వేశారు. ధనుంజయుడు వేరే కులం వాడన్నారు. ఇష్టపడినంత మాత్రాన మనువు జరగదని కెల్లించారు. ఉత్తరక్షణంలోనే గుత్తుల పుట్టునుంచి చుట్టపాళ్లకొడుకు బగ్గణ్ణి తీసుకువచ్చేశారు.
అది కాదంటున్నా వినకుండా బలిమిని పెళ్లి చేసేశారు.అత్తవారింటికి వచ్చినా మెరియకు ధనుంజయ మీద ఆశ చావనేలేదు. అబ్బా! వాడెంత గొప్పగా మాట్లాడతాడో కదా అని ప్రతీఘడియా గుర్తుచేసుకునేది. వాడెంత మధురంగా బిల్లనగర్ర మ్రోయిస్తాడో కదా అని నిరతం అనుకునేది. అసలు వాడి నుంచి వచ్చే మదపువాసనే పచ్చిగంధమని తిమ్మిరిపడేది. ధనుడి విషయం బగ్గయ్యకీ తెలుసును. గంపరాయి పెళ్లిలో వాణ్ణి చూడకపోలేదు. వాణ్ణే తొలుత వలచి, తప్పనిసరి పరిస్థితుల్లో తనను మెరియ పెళ్లాడిందన్న భోగట్టా ఆనోటా ఈ నోటా విన్నాడు కూడాను. అయినా ఇబ్బందిలేదని, ఎవడి రాత వాడిదని తనకు తనే చెప్పుకుని గర్వపడేవాడు.ఫ ఫ ఫగుత్తులపుట్టు పక్కనున్న చిలకవలసలో జరిగే వారపుసంతకు తీసుకువెళ్లమని, పట్టాలు కొనమని, చెరుకులు తినిపించమని పెదవి కొరుకుతూ ఒకానొకనాడు మొగుణ్ణి అదోలా కోరింది మెరియ. బగ్గడి మోదానికి ఇక హద్దు కనబడలేదు. మరునాడు మధ్యాహ్నం రెండుగంటల మధ్యసిత్రంవేళనే బయలెల్లాడు. పెళ్లాన్ని తీసుకుని టింగురంగడిలా సంతకు ప్రయాణం కట్టాడు. అలా కడుతున్నప్పుడే..