‌నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అతనిని చూస్తుంటే. కలిసిన ప్రతిసారి ఏదో సరికొత్త జీవితపాఠం బోధపడుతుంది. కొన్నిసార్లు అసూయ కలుగుతుంది.ఈమధ్యనే మా గేటెడ్‌ కమ్యూనిటి పార్క్‌లో రామం అతన్ని పరిచయం చేశారు. మాలాంటి రిటైర్‌ అయిన వాళ్ళందరం ప్రతిరోజు ఉదయం నడకలోనో, సాయంత్రం కాలక్షేపానికో మా పార్క్‌లో కలుసుకోవడం రివాజు.ఎప్పటిలానే మేమందరం పార్క్‌లో ఉన్న ఖరీదైన మార్బుల్‌ బెంచిలపై కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నాం.ఆరోజు కాస్తా ఆలస్యంగా వచ్చిన రామం తనతో పాటు తెచ్చిన కొత్తవ్యక్తిని పరిచయం చేస్తూ ‘‘ఇతను మా ఎదురు ప్లాట్‌ సుందర్‌ వాళ్ళ నాన్నగారు’’ అన్నారు.‘‘నమస్తే అండి, నా పేరు మాధవరావు, మాది విజయనగరం. నేను మా వూర్లో స్కూల్‌ టీచర్‌గా చేసి, గత నెలలోనే రిటైర్‌ అయ్యాను.’’మనిషి పొట్టి పొడుగు కాదు, తెల్లని తెలుపుకాదు, నల్లని ఆకాశంలో అక్కడక్కడ తెల్లగా మెరుస్తున్న చుక్కల్లా ఆయన తలలో మెరుస్తున్న తెల్ల వెంట్రుకలు, తెల్లని పంచె కట్టి, అంతకంటే తెల్లని లాల్చితొడిగి నిటారుగా నిలబడిన శరీరంతో ఆకర్షణీయంగానే ఉన్నారు. ఆ కళ్ళు ఏదో కాంతితో మెరుస్తున్నాయి.

 

ఆయన పెదవులపై సన్నని చిరునవ్వు.ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం. రామం బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌గా, ముకుందరావు బీమా కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా, నేను స్టీల్‌ ప్లాంట్‌లో సీనియర్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌గా, హెచ్‌.జి.సాహు పెద్ద కార్పోరేట్‌ కంపెనీలో జి.ఎం.గా - ఇలా మేమందరం పెద్ద పెద్ద పొజిషన్లో రిటైర్‌ అయ్యాం. ఒకరకంగా చూస్తే మాధవరావుది మాతో కూర్చొనే స్థాయి కాదు. మా బ్యాంక్‌ బేలన్స్‌లు, ఇళ్ళ స్థలాలు మమ్మల్ని మరింత పెద్దవారిని చేశాయి. నాకంటే ఆరేడేళ్ళు పెద్దవారయిన నా మిత్రులు పదవీ విరమణ చేసి ఆరు సంవత్సరాలు పైనే అయ్యింది‘‘మా అబ్బాయి సుందర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పెద్దహోదాలో ఉన్నాడు. మీ గేటెడ్‌ కమ్యూనిటిలో ఫ్లాట్‌ కొనుక్కొన్నాడు. ఎన్నడూ వూరు దాటని నేను మా అబ్బాయి కోడలు బలవంతం మీద, ఎట్లాగు రిటైర్‌ అయ్యాను కదా అని మొన్ననే ఇక్కడకు వచ్చాను. ఉదయం రామంగారు పరిచయం అయ్యారు. ఈ పూట మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తానంటే ఇలా వచ్చాను’’ అంటూ చెప్పులు విప్పి, మా బెంచ్‌కి ఎదురుగా గడ్డిలో బాసిం మఠం వేసుకొని కూర్చున్నారు.