‘‘ఇదేనా నీ ఆఖరి నిర్ణయం’’ కొంచెం కఠినంగానే అడిగాడు శేఖర్‌. ‘‘ఇక చెప్పే ఓపిక నాకులేదు’’ స్థిరంగా పలికింది రవళి కంఠం. ‘‘ఇన్నాళ్లూ కలిసుండి ఇంత హఠాత్తుగా వెళ్లిపోవడం మంచిది కాదు. నలుగురికీ తెలిస్తే ఎంత తలవంపులో ఆలోచించావా?’’‘‘తలవొంపులు కాబట్టే ఇన్నాళ్లూ ఉన్నాను. తప్పొప్పులు తెలిశాక మనస్సాక్షిని చంపుకోలేను’’‘‘పెళ్ళి వద్దనుకున్నాం, పిల్లల్ని కనకూడదనుకున్నాం. మన ఇష్టం వచ్చినట్లు బతకాలని నిర్ణయం తీసుకున్నాం. ఇన్నాళ్ళూ ఉద్యోగం చేసి, పెళ్ళి ఊసులేకుండా సంసారం చేసి ఇప్పుడు వదిలేయడం...’’‘‘ఏమో... వయసు వేడిలోనో, పక్కవాళ్లతో బేరీజు వేసుకునో అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి మన జీవితాన్ని నిర్థారించుకున్నాం. రోజులు గడిచాయి. సంఘం నిర్దేశించిన వివాహబంధాలు, వివాహం ద్వారా కలిగే సంతాన భాగ్యానికి దూరమై మనిద్దరమే పొందుకునే లాభమేమిటో నాకర్థం కావట్లేదు’’ అంది రవళి.

 ‘‘వాటన్నిటినీ ఆలోచించే ఈ ఒప్పందానికి కట్టుబడ్డాం’’ అన్నాడు శేఖర్‌.‘‘ఒప్పందమని నువ్వే అంటున్నావు. నచ్చకపోతే పరస్పర అవగాహనతో రద్దుచేసుకోవచ్చు’’ అంది రవళి.‘‘మనిష్టం వచ్చినట్లు రద్దు చేయడానికి ఇది ఇంకేదో కాదు... బంధం’’ వాదించాడు గట్టిగా.‘‘బంధమా? ఏం బంధం మనది? శారీరక అవసరాలు తప్ప మానసిక సంతృప్తికి స్థానం లేని బంధం మనది. మనం కలిసుండడం మొదలుపెట్టిన తర్వాత పెళ్ళి చేసుకుందామని అడిగాను గుర్తుందా? నువ్వు ఆ విషయం వదిలేశావు. కొన్నాళ్ల తర్వాత మీ ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తున్నారని చెప్పావు. మనిద్దరి సంగతీ చెప్పి వాళ్లను ఒప్పిస్తానని కూడా చెప్పావు. నా ఖర్మే కాలిందో, కాలే జారిందో... అప్పుడు పరిపక్వత లేదు. ఇప్పుడు జీవితానుభవాలు చాలా పాఠాలు నేర్పాయి. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను’’ అంది రవళి. రవళి చెప్పిందంతా విన్నాడు శేఖర్‌. కళ్లల్లో బయటికి కనిపించని కోపం బుసలుకొట్టసాగింది. పెదవులు అదురుతున్నాయి. గోడను చేతితో కొడుతూ ‘‘ఇంకొక్క ఛాన్స్‌ ఇస్తున్నా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇన్నాళ్ళు కలిసుండి విడిపోయి వెళ్ళిపోతే అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ నష్టపోతుంది. సంఘం సూటిపోటి మాటల్తో హింసించి చంపుతుంది. పూలను విడిచిపెట్టి గులాబీముళ్లను ముట్టుకున్నట్లుగా తయారవుతుంది నీ జీవితం...’’ ఆగాడు శేఖర్‌.