ఆ రోజు రామచంద్రం పదవీవిరమణ రోజు. కొందరికి సంతసం, మరికొందరికి దిగులు. రెండింటికి తగినన్ని సమర్థింపులు ఉండనే ఉన్నాయి. రామచంద్రం ఆ ఆఫీసులో పులిలా జీవించాడు, కాదు.. గాండ్రించాడు అనడమే సబబేమో! అతని పని తీరు, పని రాబట్టుకునే తీరు రెండు అబ్బురమే. ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్ అన్నట్టు ఇంటిలోనివారు, ఆఫీసులోనివారు అతడిరాకతో అటు ఇటు చూడటంమాని అతడి మాటలు వినేందుకు మనసును సిద్ధం చేసుకుంటారు. అలా వారంతా తను చెప్పింది పూర్తిగా తలకెక్కించుకునే దాకా వదిలేవాడుకాదు. అది కష్టమే, కానీ దీనివల్ల ఏ మాత్రం అవగాహన లేకున్నా త్వరితంగానే నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న వారెందరో ఉన్నారు.
రామచంద్రం ఇంటికి రాగానే పిల్లలే తాము చూస్తున్న ఛానెల్‌ను న్యూస్ ఛానెల్‌కి మార్చేసి రిమోట్ ఆయనకు అప్పగించేస్తారు. న్యూస్ చూడటం, ఆపైన తన వ్యూస్ చెప్పటం, వినక తప్పదన్నట్లు అందరు వినడం. అయితే ఈ అలవాటు పిల్లలలో సమకాలీన అంశాలపట్ల అవగాహన పెంచడానకి ఎంతగానో తోడ్పడింది. సరిగా వినకుండా, ఎవరైనా వింటున్నట్టు నటిస్తేమాత్రం అది కనిపెట్టేసేవారు రామచంద్ర. వాళ్ళమీదకు ప్రశ్నలు సంధించేవారు. ఇక ఆపైన వాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఎలా వస్తుందనే పాఠం మొదలయ్యేది.‘అబ్బ ఆయన రిటైరయ్యాక పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటూ అవీ ఇవీ చెబుతుంటే, ఇక ఊ అనలేం, ఆ అనలేం, ఇక పరిస్థితి ఎలా ఉంటుందో’ అని కట్టుకున్న ఇల్లాలికీ భయమే! ఆఫీసులో అతడి వాక్ప్రవాహానికి అందరు నోళ్ళు తెరచుకుని వినాల్సిందే! ఆఫీసనగానే నియమాలు, నిర్ణయాలు కలగలసిన అధికారులవైనాన్ని వివరిస్తుంది.
మరి ఇల్లంటే కాస్త పట్టువిడుపు ఉండాలికదా! రామచంద్ర భార్య రాజేశ్వరిలో ఒక్క గుబులేకాదు, అలజడి కూడా ప్రవేశించి ఆమెను ఉన్నచోట నిలబడనీయడం లేదు. గుమ్మానికే కళ్ళప్పగించి చూస్తోంది. ఇన్నాళ్ళూ తమకు అన్నీ సమకూర్చిన భర్త విశ్రాంతి తీసుకోవడం మంచిదేగానీ, ఆ విశ్రాంతి ఇంట్లోనివాళ్ళ మనశ్శాంతిని దూరం చేస్తుందేమోనని దిగులు సలుపుతోంది. ‘తరుణోపాయమే దొరక్కపోతుందా’ అని మనసును ఊరడించాక గుండె కుదుటబడి నిట్టూర్చేలోపు రామచంద్రం ఒకచేతిలో పూలగుత్తి మరోచేతిలో మిఠాయిలడబ్బాతో ప్రత్యక్షమయ్యాడు.