ఆకాశాన్ని కనిపించనీయక, కొమ్మలతో చిక్కగా అల్లుకుపోయి ఉంటుంది ఆ చెట్టు. బాగా పొడుగ్గా ఉంటుంది. చిగురించడం, ఆకు రాల్చడం దానికి లేవు. ఆరు ఋతువులూ పచ్చగా ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టంటే రాకుమారి ఉలూచికి చాలా ఇష్టం. నగర పొలిమేరల్లో గల ఆ చెట్టు దగ్గరేఎప్పుడూ సేదదీరుతుందామె. అదే ప్రియుడు అశ్వసేనుణ్ణి కలిసే సంకేతస్థలం కూడా. శత్రురాజు కుమారుడైనా అశ్వసేనుణ్ణి ప్రేమించింది ఉలూచి. అశ్వసేనునికి కూడా ఉలూచి అంటే పంచప్రాణాలు. తండ్రులు ఎప్పటికైనా మిత్రులవుతారనీ, తమ పెళ్ళి జరిపిస్తారని ఆశిస్తూ నిరీక్షిస్తున్నారిద్దరూ.సూర్యాస్తమయం అయింది. ప్రతిరోజూలాగే గుర్రంమీద చెట్టు దగ్గరకి చేరుకున్నాడు అశ్వ సేనుడు. ఉలూచి కోసం చూశాడు. ఆమె లేదక్కడ. ఇంకా రాలేదని, ఆమెకోసం ఎదురు చూస్తూ చెట్టుని ఆనుకుని నిల్చున్నాడు. అతను చెట్టుని ఆనుకుంటే చాలు, అంత చెట్టూ చిత్రంగా జలదరిస్తుంది. పువ్వుల్ని రాలుస్తుంది. ఒకటి రెండుసార్లు అది వింతగా అని పించింది. తర్వాత అలవాటైపోయిందతనికి. పెద్దగా పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు కూడా తనని అభిషేకిస్తున్నట్టుగా పువ్వులు రాలిపడితే, సన్నగా నవ్వుకుంటూ పైకి చూశాడు అశ్వసేనుడు. చెట్టుకొమ్మలు ఊగుతూ పరవశంగా కనిపించాయి. అంతలో ఉలూచి సఖి పరుగున వచ్చిందక్కడకి. పరుగున వచ్చిందేమో! ఆయాసపడుతూ నిల్చుంది. మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందిగాని, మాట రావట్లేదు.‘‘ఏమైంది సఖీ! నీ చెలి ఉలూచి ఏది? తను రాలేదా?’’ అడిగాడు అశ్వసేనుడు.‘‘రాలేదు రాకుమారా! మహారాజు ఆమెకు పెళ్ళి నిశ్చయించారు. చేదిదేశాధినేత శిశిరునితో ఆమె వివాహం జరగబోతోంది.

అంతఃపురం దాటి అడుగు బయటపెట్టరాదట! రాజుగారు ఆంక్షలు విధించారు.’’ అన్నది సఖి. ఆశ్చర్యపోయాడు అశ్వసేనుడు.‘‘ఈ రాత్రి తమని రాకుమారి రహస్యంగా రమ్మంది. ఉద్యానవనంలో నిరీక్షించమంది. అర్థ రాత్రి దాటిన తర్వాత మిమ్మల్నక్కడ కలుసుకుంటానంది.’’ చెప్పింది సఖి.‘‘అంటే రాక్షసవివాహం చేసుకుందామంటుందా?’’ ఆత్రపడ్డాడు అశ్వసేనుడు.‘‘ఏమో రాకుమారా! రాకుమారి ఆంతర్యం మీకే తెలియాలి.’’‘‘సరే! అర్థరాత్రి ఉలూచిని ఉద్యానవనంలో కలుస్తున్నామని చెప్పు.’’ అన్నాడు అశ్వసేనుడు.బాగా చీకటి పడింది. ఆ చీకటిలో ఒంటరిగా ప్రయాణించి అంతఃపురానికి చేరుకోవాలి. పరుగందుకుంది సఖి. కనుమరుగైన సఖిని చూసి, గుర్రాన్ని అధిరోహించి, అశ్వసేనుడూ అక్కణ్ణుంచి నిష్క్రమించాడు.