పూర్వం కాశీరాజ్యంలో కుముదుడు-అమాయకుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. కుముదుడు పెద్దవాడు, తెలివిగలవాడు. డబ్బుగలవాడు.అమాయకుడు చిన్నవాడు. పేదవాడు. ఇద్దరూ వేరువేరుగా ఉంటూ ఒకే ఊరిలోజీవిస్తున్నారు. చుట్టుపక్కల జరిగే సంతలకీ, పెళ్ళిళ్ళకీ మాత్రం కలసి వెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నారు. అమాయకుడు ఆడగుర్రం మీద ప్రయాణిస్తే,మగగుర్రం మీద కుముదుడు ప్రయాణిస్తాడు.ఒకరోజు అన్నదమ్ములిద్దరూ పక్క ఊరిలో సంతకి వెళ్ళి వస్తూండగా చీకటి పడింది. రాత్రి అయింది. రాత్రి ప్రయాణం మంచిది కాదనుకుని, ఒక చోట ఆగిపోయారు. ఆ రాత్రి అక్కడే బస చేయడం శ్రేయస్కరం అనుకున్నారు. గుడిసె బయట గుర్రాలను కట్టి వేశారు. వాటికి మేత పెట్టి, వెళ్ళి గుడిసె లోపల నిద్రపోయారిద్దరూ.తెల్లారింది.లేచి చూస్తే గుడిసె బయట రెండు గుర్రాలు కాదు, మూడు గుర్రాలు కనిపించాయి వారికి. మూడోది గుర్రప్పిల్ల. ఏ రాత్రి పుట్టిందో ఏమో! కింద తడుముకొని పోతోంది.
లేచి నిలబడేప్రయత్నం చేస్తూ, ఫలించక పడిపోతోంది. అయినా పట్టు వీడలేదు. నేలమీద కాళ్ళను నిలదొక్కుకుని లేచి నిలబడింది. తల్లి గుర్రం దగ్గరకు వెళ్ళి, కడుపారా పాలు తాగింది. శక్తి సంతరించుకుందేమో! మెల్లగా నడచి వెళ్ళి, మగగుర్రం దగ్గర నిలుచుంది. తన పక్కన నిల్చున్న పిల్లను చూసి, మగగుర్రం ఆనందంగా పెద్దగా సకిలించింది. గుర్రప్పిల్ల ముద్దుగా బాగుంది. పెరిగి పెద్దయితే అద్భుతంగా ఉంటుందనుకున్నాడు కుముదుడు. కాజేయాలనుకున్నాడు. ఎప్పుడైతే పిల్ల వెళ్ళి మగగుర్రం పక్కన నిలుచుందో అప్పుడు, ఆ పిల్ల తనదన్నాడతను. తన గుర్రానికే ఆ పిల్ల పుట్టిందన్నాడు.‘‘అదెలా సాధ్యం అన్నయ్యా? మగగుర్రానికి పిల్ల పుడుతుందా చెప్పు? అది నా గుర్రానికి పుట్టిన పిల్ల. అది నాది, నీది కాదు.’’ అన్నాడు అమాయకుడు.‘‘నాదే! నా గుర్రానికి పుట్టిందే ఆ పిల్ల. కావాలంటే చూడు, నా గుర్రానికి ఉన్నట్టుగానే, ఆ పిల్లకి కూడా చెవి దగ్గర నల్లటి మచ్చ ఉంది.’’ అన్నాడు కుముదుడు.‘‘మచ్చ ఉన్నంత మాత్రాన, మగగుర్రానికి ఆ పిల్ల పుట్టిందంటే నవ్విపోతారెవరైనా.’’‘‘ఎవరు నవ్విపోతే నాకేమిటి? అది నా గుర్రానికి పుట్టిందే, అందులో అనుమానం లేదు. లేకపోతే ఆ పిల్ల, నా గుర్రం దగ్గరకు వెళ్ళి ఎందుకు నిలుచుంటుంది?’’ అడిగాడు కుముదుడు.