అది బెలగాం వీథుల్లో ఒకప్పటి కేక. వరసకట్టిన పాటలాగా ఆ కేక చెవిన పడిందీ అంటే ఎండ పొడ పలచబడేది. సాయంత్రానికి తెర తీస్తూ ఊరు చల్లబడేది. దారిపొడుగునా రేడియోల్లో సిలోన్ తెలుగు పాటలు వింటూ, బడి పిల్లలు ఇళ్ళకు తిరిగొచ్చేవారు. అగ్రహారం వీథి చివర ఈశ్వరుడి కోవెల చెరువుగట్టు మీంచి పశువులు పల్లంలోని కళ్లాల వైపు దిగేవి. టైమ్ మెషీన్ వెనక్కి తిప్పి, ‘బన్ రోటీ, బిస్కెట్....’ అంటూ పాటలాంటి ఆ కేకను మనసుతో మరొక్కసారి వింటే, కమ్మని బేకరీ వాసన హృదయాన్ని కమ్ముకుంటుంది. అద్దాలపెట్టెలో బన్నులు, బ్రెడ్డులు, బిస్కట్లు, రస్కూలు మోసుకొచ్చిన అరవయ్యేళ్ళనాటి అచ్చన్న–లచ్చన్న సోదరులు ఇరవైదాటని వాళ్ళలా ఈనాటికీ కళ్ళకు కడతారు.

వాళ్ళు పోలికలు కలబోసుకున్న కవలలు. ఎవడు అచ్చన్నో, ఎవడు లచ్చన్నో ఓ పట్టాన తెలిసేదికాదు. పోల్చుకోవాలంటే కొన్ని గుర్తులుండేవి. పెద్దవాడు అచ్చన్న నిక్కరు వేసుకునేవాడు. చిన్నవాడు లచ్చన్నమట్టుకు ఫ్యాంటులోనే కనిపించేవాడు. నల్లగా జిడ్డోడే అచ్చన్న నుదుటమీద రాయగడ మజ్జి గౌరమ్మ సిందూరం బొట్టు రేడియం పూతలా మెరిసేది. ఎంతలా రుద్దినా వదలని మోమాటం వాడి మొహంనిండా కనిపించేది. అచ్చన్న మనసు తెలిసినవాళ్ళు అమాయక చక్రవర్తి అనేవాళ్ళు. మనిషిని మాత్రమే ఎరిగినవాళ్ళు మెత్తగా దొరికాడు కదాని ఆట పట్టించేవాళ్ళు.‘‘అచ్చిగా, నువ్వు కూడా మీ తమ్ముడిలాగా ఫేంటేసుకోవచ్చు కదరా? ‘గుండమ్మకథ’ లో ఎన్టీవోడిలాగా ఈ బుడబుడాకీ నిక్కరేట్రా?’’ అని ఎవరైనా అంటే అచ్చన్న నవ్వీసేవాడు.