కథలకు కేరాఫ్‌ ఆ కేఫ్‌. ఇరానీ చాయ్‌ ఘుమఘుమల మధ్య కబుర్లు కలగలిసి పోతాయి, అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రంలో అర్థంలా. విడదీసి చూస్తే ఒక సంభాషణ నిండా భవిష్యత్తుంటే, మరో సంవేదనంతా గతమే.సమయం ఏదైనా అక్కడ కనీసం 30 మంది కనిపిస్తారు, అది కృష్ణానగర్‌ సినీ జీవులకు కామన్‌ అడ్డా. ఏ ఫిల్మ్‌ ఆఫీస్‌లో గెటౌట్‌ అన్నా, అక్కడ గెట్‌ ఇన్‌ అవ్వొచ్చు. ఇంతమందిలో నేనొక్కడినే ఎందుకు సైలెంట్‌గా ఉంటానంటే, నా ఎదుటి జంటల జగడాల్లోకి చెవులు దూర్చడానికి. ఏదైనా లీడ్‌ దొరకొచ్చు, ఇంకేదైనా సినిమా కబురు కిక్కివ్వచ్చు.. రాబోయే వర్షానికి పొలంలో తూనీగల సంకేతం రైతన్నకు ఉత్సాహం ఇచ్చినట్లు.నేను చెప్పిన కథలో ‘‘క్లైమాక్స్‌ బలహీనంగా ఉంది, హీరో పాత్రకి జస్టిఫికేషన్‌ చెయ్‌’’ అన్నాడు నిర్మాత. నా కథలో నాయకుడు తెలుగు సినిమా నాయకుడిలానే ఉన్నాడే, ఏం చేయాలో అర్థం కాలేదు. కథ మధ్యలో రైటర్స్‌ బ్లాక్‌ వచ్చినప్పుడు ఇలా వచ్చి రెండు చాయ్‌ తాగి మేధోమథనం చేస్తే కథకూ, నా నిరీక్షణకూ క్లైమాక్స్‌ వచ్చేస్తుందని ఆశ.

 అట్లా ఎన్నో కథల పుట్టుకకు పురుడు పోసిన ఈ బావర్చిలో ఈమధ్య గమనిస్తున్నాను - కంచికి చేరని కథలు అనేకం.క్లైమాక్స్‌ పూర్తి చేసి ఇవ్వడానికి మూడు రోజులు టైం ఉంది. ఒకవేళ డెడ్‌ లైన్‌లో పని పూర్తి కాకపోతే! సన్నగా వణుకు మొదలైంది. నెవర్‌... నెవర్‌.. నెవర్‌.నాలుగింటికి వచ్చి నాలుగో చాయ్‌ తాగుతుండగా కనిపించింది.. నా కుడి వైపు మూడవ టేబుల్‌ దగ్గర కూర్చున్న అమ్మాయి. రెండుసార్లు సర్దుకుని మూడోసారి చిరాకుగా చూసింది. అప్పటికి తేరుకొని తల తిప్పుకున్నాను.

ఒక నిమిషం గ్యాప్‌ ఇచ్చి ‘ఇంకా కోపంగానే ఉందా’ అని ఓరకంట చూశాను, అదే సమయానికి ఆమె కూడా... అప్పుడే తెలిసింది, అందగత్తేనని. ఈసారి స్టయిల్‌ గానే తల తిప్పుకున్నాను.వెళ్లేముందు మాట కలుపుదామని అటు వైపు చూశాను. ఎవరితోనో గొడవ పడుతోంది. అది ముగిశాక వాళ్లతోనే వెళ్ళిపోయింది. నేను మాత్రం వచ్చిన పని తప్ప మిగతావన్నీ పట్టించుకున్నా. నైట్‌ 12 .. క్లోసింగ్‌ టైం. అప్పుడే ఒక రోజు అయిపోయింది.