మొబైల్‌ తీసి చూశాను పొద్దున ఆఫీసుకెళ్ళబోతూ. ఆ రోజు చెయ్యాల్సిన పనుల లిస్ట్‌ ఇంకోసారి చెక్‌ చెయ్యడానికి -9:00 - విన్నీ పాపకి ‘ప్రిన్సెస్‌’ కేక్‌ ఆర్డర్‌ చెయ్యాలి.12:00 - అకౌంట్స్‌ ట్యాలీ చేసి బాస్‌కి ఈమెయిల్‌ చెయ్యాలి.1:00 - శాన్‌భాగ్‌లో లంచ్‌కి కలిసినప్పుడు లతకి ముందే ‘సారీ’ చెప్పాలి.2:30 - హోండా డీలర్‌తో జాబ్‌ ఇంటర్వ్యూ అటెండ్‌ అవ్వాలి.4:30 - చాయ్‌ కాకా అమౌంట్‌ క్లియర్‌ చెయ్యాలి.8:00 - ధనంజయ్‌ని బార్‌కి తీస్కెళ్లి వచ్చే దార్లో చంపాలి.9:00 - ?ఎక్కడా తేడా లేదు. మొబైల్‌ని ప్యాకెట్లో తోసి బైకెక్కాను.బేకరీ దగ్గర ఆగాను. ‘ప్రిన్సెస్‌’ కేక్‌ ఈ మధ్య చెయ్యట్లేదన్నాడు వాడు. ఇంకో రెండు మూడు చోట్ల తిరిగినా అలాంటివి లేవన్నారు. ఏమైంది ఉన్నట్టుండి వీళ్ళందరికీ? ఆఫీసుకి లేటవుతోంది. విన్నీకే ఫోన్‌ చేసి వేరే ఆప్షన్స్‌ అడిగితే? దాన్ని సర్‌ప్రైస్‌ చేద్దామనుకున్నా, కానీ వేరే కేక్‌ పంపి, అది నచ్చకపోతే?ఇబ్బందిగానే కాల్‌ చేశాను. రెండు రింగుల్లోనే ఎత్తింది. ‘‘హలో..’’ అన్నా అటెవరూ మాట్లాడట్లేదు. వెనకాల రకరకాల శబ్దాలూ, నవ్వులూ. మెల్లగా తలుపేసిన శబ్దం. నాకర్థమైంది.‘‘హాయ్‌ డాడీ..’’ రహస్యం చెప్తున్నట్టు అంది.‘‘హాయ్‌ బుడ్డీ, హ్యాపీ బర్త్‌ డే రా!’’‘‘థాంక్స్‌.. ఇప్పుడా చెప్పేది. రాత్రంతా వెయిట్‌ చేశాను.’’‘‘సారీ రా - నువ్వు నిద్రపోయావనుకున్నా. ఫోన్‌ అమ్మ లిఫ్ట్‌ చేస్తే మళ్ళీ గొడవ అని చెయ్యలేదు.’’‘‘నువ్వు మమ్మల్ని మర్చిపోయావంట? అమ్మా, అమ్మమ్మా చెప్పారు చాలా సార్లు నాతో.’’ప్రశ్న లాంటి నింద.‘‘ఛ ఛ, నిన్ను మర్చిపోడం ఏంట్రా! పోయిన వారం కాల్‌ చేశా కదా?’’మధ్యలో చాలాసార్లు చేసినా మీ అమ్మ కట్‌ చేసిందని చెప్పలేకపోయాను.‘‘లాస్ట్‌ బర్త్‌ డే గుర్తుందా డాడీ? మనింటి దగ్గర ఫ్రెండ్సందరూ వచ్చారు. మెర్మైడ్‌ కేక్‌ తెచ్చావ్‌. చాలా ఆడుకున్నాం. ఇక్కడ అమ్మమ్మా వాళ్ళింటి దగ్గరసలు ఫ్రెండ్సే లేరు. నువ్వొచ్చి తీస్కెళ్లు డాడీ వెంటనే మనింటికి -’’అది బాధగా, కోపంగా కళ్ళు తిప్పుతూ చెబుతున్నట్టు ఊహించుకున్నా. ఏ మాటకి ఎలాంటి ఎక్స్‌ప్రెషనిస్తుందో ఏడేళ్లుగా చూస్తున్నా.

                                                    *****************************************