ఆరేళ్ళ వయసులోనే అతనిలో ఎన్నో సందేహాలు. అతని వయసుతో పాటే అవి కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే ఆ సందేహాలకు నివృత్తి లేదు. వాటి మర్మమేమిటో కూడా అంతుచిక్కలేదు. నిత్యం కళ్ళముందే జరుగుతున్నా, అతనికి ఎన్నో అనుభవాలు ఎదురయినా, ‘తనదాకా వస్తే ఎలా ఎలా ఎదుర్కొంటాను’ అనే ప్రశ్న మాత్రం అతన్ని తొలిచేస్తూనే ఉంది. ఇంతకీ అతని సందేహాల పరంపర దేనిగురించి? అతనిదాకా వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యాడు?ఈ అనంతకోటి చరాచర సృష్టిలో నిత్యం కొన్ని లక్షల జననాలు సంభవిస్తాయి. అంతే సంఖ్యలో మరణాలూ సంభవిస్తుంటాయి. అయితే ఇవన్నీ నిత్యం మన కళ్ళముందే జరుగుతున్నా, జనన–మరణాల మర్మమేమిటో ఈనాటికీ అంతుచిక్కకపోవడం చిత్రాతిచిత్రం!అయినాగానీ మనిషి ‘నేను’ పర్మినెంట్‌ అనే ఆలోచనతోనే తన జీవితప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

అసలు ఈ ప్రక్రియ అంతా ఎవరి ఆధీనంలో ఉందో, దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో అనే సందేహాలకు నివృత్తి లేదు. సందేహ నివృత్తి లేకుండానే మనిషి గతిస్తూనే ఉన్నాడు. ‘నేను–నా శరీరం’ అనే భావనతో, అసలు మర్మం అవగతం కాకుండానే ‘అతను’ గతించిపోతున్నాడు. అసలు ‘ఇక్కడ’ అంటే ఏమిటి? ‘ఉండటం’, ‘లేకపోవడం’ అంటే ఏమిటి? ఈ మధ్యలో జరిగే తంతు ఎవరు నడిపిస్తున్నారు? ‘ప్చ్‌...’ అర్థం కాదు. వయసు పెరుగుతున్నకొద్దీ ఇటువంటి ఆలోచనల మధ్య, ఒంటరితనం, భయం ఆవహిస్తుంటే; పాత పుస్తకాలు తిరగేస్తున్నా, ప్రకృతి మధ్య తిరగాడుతున్నా, స్నేహితులతో మాట్లాడుతున్నా, నిత్యం వేధించే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరనే వెదుకులాటల మధ్య,...ఇంతేనా ఈ జీవితం?

ఎత్తయిన కొండల్లోంచి లేలేత కిరణాలతో పైపైకి ఎగబాకుతున్న ఉదయించే సూర్యుణ్ణి చూస్తూ; మరింత ఎత్తుగా కనిపించే చెట్లమధ్య నుండి శక్తిమంతంగా కనిపించే సూర్యుణ్ణి చూస్తూ; సాంతం వడలిపోయి, ఎర్రటిపండులా అనుభవ గమనంతో పడమటకు దిగిపోతుంటే... ఒక శిశువు, ఒక బాలుడు, ఒక యువకుడు, ఒక వృద్ధుడు వచ్చి, ఎదిగి, ప్రకాశించి, మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతున్నట్లుగా... నేనూ అంతేనా?నాకు అర్ధమై కాకుండా, తెలిసీ తెలియనట్లుగా – ఏమీ తేల్చుకోలేక... అలా ఆగిపోతే.. ‘మనసంతా శూన్యమై...’