ఏతాంమానులాగా అంతెత్తున ఉండేవాడు బెలగాం గెడ్డ వీధి లింగబాబు. బెలగాం హైస్కూల్లో ఫోర్త్ ఫారమ్ చదివే రోజుల్లో సెవెంత్ ఫారం స్టూడెంట్ లాగా ముదురుగా కనిపించేవాడు. హైస్కూల్‌ వెనకవైపు ప్రహారీగోడమీదికి కోతిలాగా ఎగిరి, కొంగలాగావాలి, తెడ్డుల్లాంటి చేతులుచాపితే చాలు- లింగబాబు పిడికిళ్ళనిండా చింతకాయ గుత్తులే!స్నేహితులంతా లింగబాబుని ‘రమణారెడ్డి’ అని పిలిచేవాళ్ళు. హైజంప్, లాంగ్ జంప్ పోటీల్లో లింగబాబుని కొట్టేవాడు, పార్వతీపురం స్కూల్ మొత్తంమీద లేడనేవారు. ఓ సారి స్కూల్ వార్షికోత్సవాల సందర్భంగా బహుమతులిచ్చేటప్పుడు వామనుడిలా ఉండే హెడ్మాస్టర్ తామవాడ శంకరరావుగారు లింగబాబు చొక్కాకి మెడల్ తగిలించడానికి నానా అవస్థలూ పడ్డారు. ఆయన మునివేళ్ళమీద పైకి లేచి, ‘‘ఒరేయ్ ద్రాక్షారామ భీమేశ్వరా.. కొంచం కిందకి వంగరా..’’ అనగానే హైస్కూల్ సెంట్రల్ హాల్ నవ్వులజల్లుల్లో నాని ముద్దైపోయింది.ఆ రోజులు తలచుకున్నప్పుడల్లా, లింగబాబు చాలాసార్లు కన్నీటిలో తడిసి ముద్దైపోయేవాడు.

ఓ ఏడాది ఇచ్చాపురంలో జిల్లాస్థాయి పాఠశాలల ఆటలపోటీకి పార్వతీపురం హైస్కూల్ టీములో లింగబాబుని ఫిజికల్ డైరెక్టర్ పోతుల సూర్యనారాయణగారు ఎంపిక చేశారు. అప్పుడాయన లింగబాబుతో, ‘‘ఒరేయ్ ఇక్కడంటే నువ్వొక్కడివేగానీ, ఇచ్చాపురానికి జిల్లా మొత్తంనుంచి వస్తారు. కాంపిటిషన్ టఫ్ గా ఉంటాది. ఏదో మొక్కుబడికి ఎల్లడంకాదు. బాగా ప్రిపేర్ అవ్వాలి’’ అంటూ లింగబాబుని బాగా రుద్దారు. లింగబాబు కూడా రెచ్చిపోతూ ప్రాక్టీస్ చేశాడు. తెల్లవారితే బస్సులో హైస్కూల్‌ జట్టు బయల్దేరుతుందనగా కథ తారుమారైంది. లింగబాబు ఆటలపోటీలో పాల్గొని, పతకాలు సాధించడంమాట అటుంచి, వాడి ఫోర్త్ ఫారం చదువు నడిమధ్యలో ఆగిపోయింది. బెలగాంసెంటర్ కీ, పార్వతీపురం టౌన్ కీ మధ్యనున్న వేణుగోపాల్ టాకీస్ లో బతుకుతెరువు చూసుకోవాల్సివచ్చింది. లింగబాబు లాంగ్ జంప్, హైజంప్ ప్రాక్టీస్ చేసినప్పుడు పోతుల సూర్యనారాయణగారు, డ్రిల్లు మాస్టారు బసవన్నగారు ఎప్పటికప్పుడు స్టాండర్డ్ పెంచుతూ వెళ్ళేవారు. ‘‘మరింత దూరం దాటాలి..మరింత ఎత్తుకు ఎగరాలి’’ అంటూ, లింగబాబుకి సవాళ్లు విసిరేవారు. ముందు లింగబాబు, ‘‘ఓ లమ్మో..’’ అని డీలాపడినా, వెంటనే పిడికిలి బిగించేవాడు. గట్టిగా ఊపిరి తీసుకునేవాడు. ‘‘చూస్కోండి..’’ అంటూ మెరుపు వేగంతో, మెరుగైన ప్రదర్శనతో ప్రశంసలు పొందేవాడు. అప్పుడు పోతుల సూర్యనారాయణగారు లింగాబాబుని పాల్ఘాట్ మణి కేఫ్ కి తీసుకువెళ్ళేవారు. వాడికి ఇష్టమైన రవ్వదోశ తినిపించేవారు.