‘‘చింతలపూడి.... చింతలపూడి....’’ కండక్టర్ అరిచాడు.ఆమె బస్సు దిగబోతూ అడిగింది. ‘‘ఇక్కడ ఊరు ఏమీ కనిపించడం లేదేం?’’ అని.‘‘ఆ రోడ్డు వెంట మైలుదూరం వెళ్తే వస్తుంది’’ అన్నాడు కండక్టర్.ఆమె బస్సు దిగింది.. రోడ్డు వెంట నడుస్తోంది.రోడ్డుకు రెండువైపులా తివాచీలు పరిచినట్లున్న పంటచేలు. ఆకాశలోకాల నిండా కమ్ము కొస్తున్న నల్లనిమేఘాలు. వృక్షాలను నేల కూల్చేంత విసురుగా గాలి... ఒక అడుగు ముందుకీ, రెండు అడుగులు వెనక్కీ....
అప్పుడూ ఇలాగే... నవయవ్వనారంభ వేళల్లో, కలతలు పడిన మనసు, మడతలు పడిన నడత.... అనుక్షణం ఆనందంలోకాల్లోకి ఆహ్వానాలు పలికిన అనుభవాలు... ఒళ్లు తెలియని వివశత... కాలు నిలువనివ్వని కాలం వడివడిగా కలల అలల్లోకి లాక్కెళ్లింది. అదుగో, అప్పుడలా తడబడిన నడవడి వల్లనే, ఇప్పుడు ఒక అడుగు ముందుకీ, రెండు అడుగుల వెనక్కీ...తిరస్కారం తప్పదని తెల్సీ, చిన్న ఆశ ఏదో ముందుకు లాక్కుపోతోంది. అవమానం ఎదురవు తుందా? అనవరతం మస్తిష్కాన్ని మధిస్తున్న నిరంతర రొదల్లో ఇదీ ఒకటి అవుతుందా?ఊరి మొదట్లోకి వచ్చింది. చినుకులు మొదలైనయి.అరుగుమీద కూర్చున్న వ్యక్తిని అడిగింది.‘‘చిన్ని కృష్ణగారిల్లు ఎక్కడ?’’‘‘ఇదేనండి... రండి లోపలికి...’’ అన్నాడా వ్యక్తి లోపలికి దారితీస్తూ.పెద్దకాంపౌండు. పెద్ద గేటు... లోపలికి అడుగుపెడుతుండగా పెళపెళమని ఆకాశం బద్దలై నట్లు ఉరుములు...లోపలికి వచ్చింది.
ముందుభాగం విశాలంగా బండలు పరిచి, శుభ్రంగా ఉంది.హాల్లోకి తీసుకెళ్లాడు.‘‘అయ్యగారు తోటలో ఉన్నారు. పిలుస్తాను... మీరు కూర్చోండి...’’సోఫాలు.... బీరువాల నిండా పుస్తకాలు... సంపదకే కాదు, సౌశీల్యానికీ కొదవలేదు.పని మనిషి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. లెమన్‌జ్యూస్‌తో పాటు.‘‘ఇంట్లో ఎవరూ లేరా?’’ అని అడిగిందామె.‘‘లేరు...’’ అన్నది పని మనిషి.ఆమె మొహానికి ఉన్న అచ్ఛాదనం కొద్దిగా తొలగించి, మంచినీళ్లు తాగింది.తనెవరో తెలియకుండానే, ఆదరణ, మర్యాదలు... బహుశా ఇంటికి ఎవరొచ్చినా, ఎవరూ చెప్పకుండానే ఈ ఆదరణ చూపిస్తారేమో....సంపెంగ పొదలో పాములుంటాయని భయపడింది గానీ, దాని చుట్టూ గుబాళించే పరిమళం గురించి మర్చిపోయింది.కొద్దిగా వర్షంలో తడిసి, ఆయన లోపలికి వచ్చాడు. అదే విగ్రహం... ఆజానుబాహుడు... సాదా సీదా దుస్తుల్లోనున్న యుగపురుషుడిలా ఉన్నాడు.ఆమె వంగి ఆయన పాదాలకు నమస్కరించింది, ఆయన వారిస్తున్నా...