పూర్వం ఒక ఊళ్లో రాజయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారి కుమారుడు ముకుందుడు రోజూ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, బడికి వెళ్లేవాడు. వాడు చాలా బుద్ధిమంతుడనీ, వాడికి చదువంటే శ్రద్ధ అనీ తలిదండ్రులు అనుకునేవారు. అలాంటి ముకుందుడు ఒకరోజున ఉన్నట్లుండి ఉదయమే మంచంమీంచి లేవనైనా లేవకుండా పెద్దగా కేకలు వేయసాగాడు. అది విని తల్లిదండ్రులు కంగారుగా వెళ్లి, ‘‘ఏమిట్రా, అలా అరుస్తున్నావు!’’ అనడిగారు.

‘‘నాకు ఒళ్లంతా సూదులు గుచ్చినట్లుంది. మండిపోతోంది’’ అంటూ మళ్లీ బాధగా కేకలు పెట్టాడు ముకుందుడు. రాజయ్య వెంటనే పరుగునవెళ్లి ఆ ఊరి వైద్యుడు రంగాచారిని పిల్చుకుని వచ్చాడు. రంగాచారి ముకుందుణ్ణి కొన్ని ప్రశ్నలడిగాడు. ఒళ్లంతా నొక్కి చూశాడు. ‘‘ఈ రోగలక్షణాలు ఒకదాని కొకటి పొసగడం లేదు. జబ్బేమిటో అంతుపట్టడం లేదు’’ అని ఇంకా ఏదో అనేలోగా ముకుందుడు మళ్లీ కేకలు పెట్టసాగాడు.కొడుకు బాధ చూడలేని పార్వతమ్మ వైద్యుడితో, ‘‘ఎలాగోలా వీడి జబ్బేమిటో కనిపెట్టి మంచి మందివ్వండి. పిల్లాడి బాధ చూడలేకపోతున్నాం’’ అని బ్రతిమాలింది.‘‘కుర్రాడిది జబ్బులా లేదు.

బడికెళ్లడం ఇష్టంలేక కొందరు పిల్లలు ఇలా లేని రోగాలు నటిస్తూ ఉంటారు’’ అన్నాడు రంగాచారి. కానీ పార్వతమ్మ ఒప్పుకోలేదు. పసివాడైన తన కొడుక్కి నటనలెలా తెలుస్తాయంది.‘‘ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. కుర్రాణ్ణి రెండు రోజులు పరిశీలించి చూద్దాం. ఈలోగా జబ్బు దానంతటదే నయమైపోవచ్చు!’’ అని వెళ్లిపోయాడు రంగాచారి.తల్లిదండ్రులకు రంగాచారి తీరు తృప్తిగా అనిపించలేదు. వైద్యుడివల్ల కాకపోతే ముకుందుడి బాధ తగ్గించే ఉపాయమేమిటా అని ఆలోచనలో పడ్డారు.ముకుందుడు కాసేపు హడావుడి చేసి నిద్రపోయాడు. అతడా రోజున భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు.