‘‘అయ్యో, అయ్యో, వదలండి. ఇదేం పని...’’కేకలు వినబడటంతో, చేతిలో ఉన్న కాఫీ కప్పు గభాలున టేబుల్‌మీద పెట్టి లేవబోయింది వర్ధని. మోకాలు కలుక్కుమనటంతో మళ్ళీ కూర్చుండిపోయి కాలు స్వాధీనం చేసుకోబోయింది. ఈ లోగా లోపలినుంచి లక్ష్మి బయటకువచ్చి తలుపు తీసుకుని హడావిడిగా పరుగెత్తింది.

వర్ధని మోకాలు సరిచేసుకుని తలుపుదాకా వచ్చేసరికి లక్ష్మి వస్తూ కనిపించింది. గుమ్మం దగ్గరే ఆగి లక్ష్మి దగ్గరకు రాగానే ‘‘ఏమైంది?’’ అని అడిగింది.‘‘లోపలికి పదండమ్మా చెబుతాను’’ అంది లక్ష్మి. ఆమె ముఖం అదోలా ఉంది. ఆశ్చర్యం, విచారం కలగలిపిన భావమేదో ఆమె ముఖంలో కనిపిస్తోంది.‘‘ఏమైంది లక్ష్మి, ఆ కంఠం మాధవరావుగారి మరదలు కంఠంలా ఉంది. ఎందుకలా కేకలు వేసింది?’’ సోఫాలో కూర్చుని ప్రశ్నించింది.అప్పటికి లక్ష్మి ముందు తలుపువేసి దగ్గరకు వచ్చింది.‘‘ఆవిడేనమ్మా, టీ తెచ్చి ఇస్తే మాధవరావుగారు తన చెయ్యి పట్టుకున్నారని గోల చేస్తోంది.

సెక్రటరీగారు, రామనాథంగారు వచ్చారు. మాధవరావుగారు ‘అలా చెయ్యటం తప్పుకదా’ అని ఆ గోవిందరావుగారు గొడవ చేస్తున్నారు’’.లక్ష్మి చెప్పిందివిని నిర్ఘాంతపోయింది వర్ధని.‘‘ఇదెలా సంభవం! మాధవరావుగారు చాలా మంచివారు. అందరితో స్నేహంగా, మర్యాదగా ఉంటారు. ఏ స్త్రీనీ ‘అమ్మా’ అని సంబోధించకుండా పలకరించరు. అలాంటి మనిషి ఇలా ప్రవర్తించారంటే నమ్మటం ఎలా?’’కొన్ని క్షణాలకుగాని వర్ధని షాక్‌నుంచి తేరుకోలేకపోయింది. తేరుకున్నాక ‘‘మాధవరావు గారు ఎక్కడున్నారు?’’ లక్ష్మిని అడిగింది.‘‘వారి హాల్లోనే ఉన్నారు. ‘నాకేం తెలియదు’ అని అనడంతప్ప ఆయనేమీ చెప్పలేకపోతున్నారు.

ఆయన్ని చూస్తే జాలేసిందమ్మా. వాచ్‌మన్‌ అతని కొడుకు కూడా అక్కడే ఉన్నారు’’.వర్ధనికి అంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. ఆ బిల్డింగ్‌లో ఉన్న పదిహేను ఫ్లాట్స్‌లో ఉన్న వారందరు సీనియర్‌ సిటిజన్సే. రెండు ఫ్లాట్ల స్వంతదారులు మాత్రం తాళాలువేసి వదిలేశారు. వాళ్ళింకా సర్వీసులో ఉన్నారు. మూడుఫ్లాట్‌లలో మాత్రమే అద్దెకున్నారు. మిగిలినవారంతా ఫ్లాట్‌ స్వంతదారులే. చాలాకాలంనుంచి ఒకరికొకరు తెలిసినవారే.