సమాజంలో మంచి అనిపించుకోవడం ఎంతో కష్టం. చెడ్డవాడనిపించుకోవడానికి క్షణం పట్టదు. అందుకే తప్పుదారిపట్టిన తన కన్నకొడుక్కి బుద్ధిచెప్పమని గురువుకు మొరపెట్టుకున్నాడో తండ్రి. కానీ ఆ గురువు మాత్రం, మంచిపని కంటే చెడ్డపని చేయడమే చాలా కష్టం అనడంతో ఆ కొడుక్కి మరింత ధీమా కలిగింది. మంచి చెబుతున్న తండ్రివైపు హేళనగా చూశాడు. ఇంతకీ ఈ రెండిటిలో ఏది నిజం? చెడ్డపని చేయడం కష్టమా? మంచిపని చేయడం కష్టమా?
చెడ్డవాడి గొప్పతనం (బేతాళ కథలు-25)రచనః వసుంధరపట్టు వదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, నీకు ఆట్టే పరిచయంలేని వ్యక్తికి సాయపడాలని, ఈ అపరాత్రివేళ నిద్రమానుకుని శ్రమపడుతున్నావు. అది మంచితనమని నువ్వనుకోవచ్చు. కానీ మంచిపనులకంటే చెడ్డపనులు చెయ్యడమే కష్టమని ఆనందుడనే గురువు అంటాడు. ఇప్పుడు నువ్వు పడుతున్నశ్రమ చూస్తుంటే నువ్వుచేసేది చెడ్డపనేమేమోనని నాకు అనిపిస్తోంది. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.ఒకానొకప్పుడు వసుదేవపురంలో గోపాలయ్య అనే మధ్యతరగతి పెద్దమనిషి ఉండేవాడు. ఆయనకు లేకలేక పుట్టిన కొడుకు గోవిందయ్య. చిన్నతనంనుంచీ వాడిది దుడుకుతనం. ఎంత చెప్పినా వినకుండా చెడ్డపనులు చేసేవాడు.
వయసు పెరిగినకొద్దీ మారకపోతాడా అని గోపాలయ్య ఆశవడ్డాడు. కానీ ఇరవైయేళ్లొచ్చినా వాడి బుద్ధులు మారలేదు.కొడుకుని ఎలా మార్చాలా అని గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఒకరోజు వాళ్లింటికి - ఆయన గురువు ఆనందుడు వచ్చాడు. గోపాలయ్య గురువుకు నమస్కరించి తన కొడుకు గురించి చెప్పుకుని బాధపడ్డాడు.‘‘నీ కొడుకు నీకు నచ్చినట్లు మసలడం లేదంటే అది నీ తప్పో, నీ కొడుకు తప్పో నాకు తెలియడం లేదు. ఒకసారి మీ అబ్బాయిని పిలు. మొహం చూస్తాను’’ అన్నాడు ఆనందుడు. కొడుకుని పిలిచాడు గోపాలయ్య. ఆనందుడు వాడివంక కొద్దిక్షణాలు తీక్షణంగా చూసి, ‘‘గోపాలయ్యా! నువ్వు అనవసరంగా బాధ పడుతున్నావు. కొడుకు చెడ్డపనులు చేస్తూంటే నీకు దిగులెందుకు? మంచికంటే చెడు చేయడమే కష్టం. కష్టమైనపని చేసేవాడు జీవితంలో ఎవ్పటికైనా గొప్పవాడవుతాడు’’ అన్నాడు.