అతను
థూ... నీ యవ్వ! ఏం బతుకు... కుక్క బతుకు. ఇసోంటి బతుకుడు బతుకుడు కంటే బండెడు రాళ్ళు మెడకు కట్టుకొని ఏ నీళ్లేనిబాయిల్నో దుంకుడు మేలు. పానం నిమ్మలమైతది. జీవికి కుదార్తమైతది.ఎవర్కి చెప్పుకోవాలె గీ బాధ. సిన్న పరేషానుగాకున్నది. అమ్మయ్యకు చెప్పుకుందా మంటే ఆల్లసలే నా మీద నమ్మికం బెట్టరు. అక్కకన్న చెప్పుకొని గింత సల్లవడ్దామనుకుంటే, ‘‘ఇంకనన్న నీ ఔలగాని చ్యాష్టలు బంజెయ్యావా? సిన్నపోరన్ననుకుంటున్నావ్, ఉన్నొక్కపిల్ల పెద్దగయితుంది’’ అంటాని నా మీదికే ఎగవడ్తది. ఆమెకు చెప్పుకునుడుకంటే ‘సీ’ బ్లాకుల, ఆరో అంతస్తుల 603ల ఉండే మలయాళం తప్ప ఇంకో భాష తెల్వని ఎనభై నాలుగేళ్ళ చెవిటి ఉన్నికృష్ణన్‌కు చెప్పుకుంటే అంతో ఇంతో అక్కెరకొస్తది.పెద్దోడు, ఒక్కగానొక్క పెద్దన్న, మొత్తం దునియ చూసినోడు, నలుగుట్ల నాల్కె లెక్క మెలిగేటోడు.. ఆనికన్న నా గోడు చెప్పుకుంటే, ఏదో ఇంత ఆసరయ్యి నన్ను గట్టున పడెయ్యక పోతడా, ఆమెను సంజాయించి, ‘గట్ల కాదు గిట్లా’ అని పెద్దిర్కంజేసి నా సంసారాన్ని సక్కదిద్దకపోతడా అని చెప్పులల్ల కాళ్ళువెట్టి ఆని తానికి పోదామంటే, ‘‘అగెయిన్ యూ హావ్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ అన్ ఈడియట్. డోంట్ ఇన్వాల్వ్ థర్డ్ పర్సన్ ఇంటూ యువర్ ఫ్యామిలీ మ్యాటర్’’ అంటాని అంగ్రేజిల క్లాసు పీకుతడు.
ఆనికి జెప్పుడు మా బాస్కి చెప్పుడు ఒకటే. పనొడ్వది పరేషాన్ తీరది, ఊదుగాలది పీరు లేవదని ఊకెనే గూసున్న.ఎట్ల గట్టెక్కాలె గీ ఆపతినించి, ఎట్ల కుదుర్కునాలె నా సంసారం. నెరీ గీ నాలుగైదునెలల సంది గీసోది ఎక్వయ్యింది. ఈమెను బరాయించుడు నా తోటి గాదు. తెల్లారకముందే, ఆరు కాకముందే లేస్తది. లేవనైతే లేస్తదిగని ఈడున్న పుల్ల ఆడవెట్టది. ఇల్లూడ్వది, ఇంటిముంగల ముగ్గెయ్యది. అదంతెందుకు పక్క మీదికెల్లి లేసినంక కప్పుకున్న చద్దరుకూడ మడ్తవెట్టది. ఎంతగనం ఈడ్సుకరావాలె ఈ కాపురాన్ని, నాతోని గాదు.మెల్లెగ, పుర్సత్గ ఏడున్నరకి వండెమింట్ల కాలువెడ్తది. అప్పటిదాంక ఆ బాల్కనీల కాళ్ళు సాపుకొని కూసోని కులుక్కుంట రెండు కోపుల కాఫీ జుర్రుతది, దాంట్లకైతే ఏం తక్వలేదు.