వేల సంఖ్యలో చీమలు చచ్చిపోయాయి. ఒక్కో చీమని తీసుకెళ్ళడానికి ఇద్దరేసి యమభటులు వచ్చి, అన్నిటినీ యమపురికి తీసుకెళ్ళారు. అక్కడ చీమలకు న్యాయ విచారణ జరపాల్సివుంది. నేర తీవ్రతను బట్టి శిక్షలు వుంటాయి. చీమల్ని ఒక వరుసలో నిలబెట్టారు. కాసేపటికి యముడు దర్జాగా నడుచుకొంటూ వచ్చాడు. ఆ వెనక చిత్రగుప్తుడు కూడా. నెమ్మదిగా మెట్లెక్కి సింహాసనంపై సుఖాసీనుడయ్యాడు యముడు.

కాస్త దూరంలో చిత్రగుప్తుడు ఒక పక్కగా కింద కూర్చున్నాడు. అతడి ముందు ఒక చిన్న టేబులూ, దానిపై పాపపుణ్యాల చిట్టా - పాత సినిమాల్లోని గుమస్తా గెటప్‌లా. మెట్ల దిగువ కుడి వైపు, వరుసగా చీమలన్నీ బారులు తీరి వున్నాయి. అవి కలలో కూడా ఊహించలేదు తాము నరకానికి వస్తామని. చనిపోయిన తర్వాత డైరెక్టుగా స్వర్గానికే వెళ్తామనుకున్నాయి. కష్ట జీవులు ఏనాటికైనా సుఖపడతారనేది వాటి గుడ్డి నమ్మకం.యముడు చాలా తీక్షణంగా వాటికేసి చూసి‘‘ఒకేసారి అన్నీ నరకానికి వచ్చాయేమిటి? అందర్నీ వరసగా నిల్చోబెట్టారెందుకు? ఎవరి నేరం వాళ్ళదే కదా. న్యాయ విచారణ తర్వాత శిక్షలు కూడా వేరే కదా?’’ అన్నాడు.‘‘లేదు ... మహా ప్రభూ. అందరూ చేసింది ఒకేరకం నేరం. అందుకని వీళ్లందర్నీ వేరు వేరుగా విచారించాల్సిన పని లేదు. ఒక్కర్ని విచారిస్తే అందర్నీ విచారించినట్లే. అందరికీ ఒకే శిక్ష అమలు చెయ్యవచ్చు.

మనకి చాలా సమయం కలసి వస్తుంది’’ వివరించాడు చిత్రగుప్తుడు.సరే అన్నట్టు తల పంకించాడు యముడు.‘‘నేరాలు చేసామా! మేం కష్టజీవులం. మాకు కష్టపడడం తప్ప మరో లోకం తెలీదు’’ అరిచాయి చీమలన్నీ మూకుమ్మడిగా.‘‘ఏమిటీ గోల?’’ కసురుకున్నాడు యముడు.‘‘మా బాధలు మీకు గోలగా వినిపిస్తున్నాయా?’’ ఆశ్చర్యపోయాయి చీమలు.‘‘నేనిక్కడున్నది మీ గోల వినడానికి కాదు. మీరు నిజంగా నేరాలు చేసారా లేక అవి వట్టి ఆరోపణలా అని విచారించడానికి మాత్రమే. నేరం రుజువు కాకపోతే మిమ్మల్ని స్వర్గానికి పంపుతాం’’ భరోసా ఇచ్చాడు యముడు.యముడి మాటల పట్ల ఆసక్తి కలిగి, కాస్త ఆశలు చిగురించాయి చీమల్లో. బతికుండగా సుఖపడింది ఎలాగూ లేదు. కనీసం విచారణ అనంతరం స్వర్గం దక్కితే అంతే చాలనుకున్నాయి.