ఆమె పేరే చేపల నల్లమ్మ. నల్లమ్మ అంటారుగానీ అంత నల్లగా ఏమీ ఉండదు. చామనఛాయ. భర్త, కొడుకు వేటకెళ్ళి చేపలుతెస్తే నల్లమ్మ వాటిని బుట్టలో నింపుకుని తీసుకొచ్చి వీధుల్లో అమ్ముతుంది. ఎన్నో పోషకాహార విలువలుండే చేపలమ్మే నల్లమ్మ దగ్గర అలవాటుగా చేపలుకొంటాడతను. అతనిబోణీ మంచిదని ఆమె నమ్మకం. చిరాకు పడినాగానీ నల్లమ్మ అంటే అతడికి జాలి. కారణం ఆమె దొడ్డమనసే! ఆమె మనసెలాంటిదంటే.....
వీధిగేటులో ఓపక్క గుబురుగాపెరిగి, అంతోఇంతో నీడనిస్తున్న నైట్క్వీన్ మొక్కనీడలో కూచుని ఉంది నల్లమ్మ లేదా ‘సేపలనల్లమ్మ’ అని అందరూ పిలుచుకునే చేపలనల్లమ్మ. నల్లమ్మ అనే పేరేగానీ నల్లగా ఉండదు. ఛామనఛాయతో, తీపికళ్ళు, కొంచెం గుగ్గిపళ్ళు, తిన్నగా చూడకుండా మెడ కొంచెం ఓ పక్కగా పెట్టి తమాషాగా చూస్తుంది.తను రెండోభార్యట.‘‘నాయప్పే నాకుసవితి అంటే మా పెద్దమ్మకూతురే! ఆళ్ళిద్దరికీ పెళ్ళై ఆరేళ్ళుగడిచినా పిల్లల్లేరు. మాబావ మంచోడేగానీ తాగితే ఆడంత సెడ్డోడులేడు. ‘నాను మళ్ళీ పెళ్ళాడతాను, నువ్వు గొడ్డుమోతుదానివి’ అని పెద్దమ్మకూతురుని తన్నీసేవోడు. అది సూసిసూసి, ‘నువ్వు ఇంతకూడు నాకెప్పుడూ ఎట్టలేదు. నేను ఇన్నేళ్ళూ సేపలమ్ముకునే నీ పక్కన బతికాను.
అసలు గొడ్డుమోతుఎదవ్వి నువ్వే. నా బతుకు నాను బతుకుతాను. ఈ లోకంలో ఇంతకూడే నాకు దొరకదా!’ అని ఆడికి రాంరాం సెప్పేసింది. వారంపదిరోజులు గడిచిందో లేదో మా ఇంటికి రావడం మొదలెట్టాడు. మానాన్న నా సిన్నప్పుడే సచ్చిపోవడంవల్ల, మాయమ్మకు నాపెళ్ళి గురించి బెంగగా ఉండేది. ఈ బావగాడు ఆ కబురూ, ఈ కబూరూసెప్పి మాయమ్మను నింపాదిగా బుట్టలోకి దింపాడు. ఎంతైనా మా బావే కదా అని నేను, ఆడు మా ఇంటికొచ్చినప్పుడల్లా ఆడిపక్కనే కూచునేదాన్ని.‘ఇక నాను తాగను, తాగనంటే తాగనప్పా! బుద్ధొచ్చింది. సిలకలా ఉంటాది మీ అమ్మన్న నల్లమ్మ.
ఈ పదిరూపాయలూ ఖర్చుపెట్టుకోయేఅని దీనిచేతిలో పదిరూపాయలకాయితం పెట్టామనుకో, రూపాయే ఖర్చెట్టుకొని మిగిలిన తొమ్మిదిరూపాయలూ తిరిగి మనసేతిలోనే పెట్టుద్ది, నాకేం ఖర్చూ అని. అంత పొందికైందే అప్పా! నీ కూతురు’ అని నన్ను పొగిడేసీవోడు. మాయమ్మ పొంగిపోయేది. ఆడిమాటలకు నాకూ సంతోసమేసేదనుకోండి. సిగ్గుతో మెలికలు తిరిగిపోయేదాన్ని. గట్టిగా మూడు నెలలవ్వనేలేదు. ఆడితో నాకు పెళ్ళైపోయింది. మీరు నమ్మరుగానీ సారూ, ఆ సంవత్సరం నన్ను కాలు నేలమీద పెట్టనివ్వలేదు. సిలకను సూసినట్టు సూసుకున్నాడు. సేపలమ్మిన డబ్బులన్నీ నా సేతుల్లోనే పోసేవోడు. తిండికేటి, బట్టకేటి దేనికీ లోటులేదు.