రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. భారతీయసమాజంలో ఇంకా వివక్ష, వర్ణవ్యవస్థ బలంగా వేళ్ళూనుకున్నరోజులు. ఒకవర్గానికి కనీస మర్యాద గౌరవం కూడా లేని రోజులు. అలాంటి కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు మంచి ఉద్యోగం సంపాదించుకుని సామాజిక గౌరవం పొందాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఇండియన్‌ మిలట్రీ పదాతిదళంలో చేరాడు. యుద్ధంలో పాల్గొని వీరోచితమైన పాత్ర పోషించాడు. అప్పుడు ఏం జరిగిందంటే.....

*********************

ఆదివారంనాటి ఉదయపు వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది.వరండాలో ఓ ప్రక్కగా కుర్చీలోకూర్చుని తనఎదురుగా సరిఎత్తు బల్లమీద ఉంచుకున్న సరికొత్తగా కనిపిస్తున్న పాతబూట్లకు ఓపికగా బ్రష్‌తో బ్లాక్‌ పాలిష్‌ పూశాడు భీమయ్య. రెండునిముషాల తర్వాత అదే బ్రష్‌తో పాలిష్‌చెయ్యడం మొదలుపెట్టాడు. పరమపాతకాలపు ఆ బూట్లు సరికొత్తవిగా నిగనిగలాడుతున్నాయి. అయినా వాటికి ఊగి ఊగి గసపోస్తూ పాలిష్‌ చేస్తున్నాడు.‘‘జేజితాత ఆ బూడ్సులు ఒకరోజు కూడా తొడుక్కోడు. కానీ ఇలా వారంవారం పాలిష్‌చేసి, అట్టపెట్టెలోపెట్టి, వాసన గోలీలువేసి మరీ ఎత్తిపెట్టేస్తాడు.. ఎందుకునాయనా?’’ అని అడిగాడు సువన్‌.‘‘నీవైతే ఆరేడేండ్లుగానే చూస్తున్నావు. నేనైతే పాతికేళ్లకుపైగా ఈ తతంగం చూస్తున్నాను. ఆయన్నడిగితేనేమో చెప్పడు. మీతాతయ్యనడిగితే తెలియదని చెప్పలేక నవ్వేస్తాడు. మా నాన్నేమో నాకు తెలియదంటాడు. మరి నేనైనా నీకేం చెప్పగలను’’ అన్నాడు సువన్‌ వాళ్ళనాన్న భరత్‌.

వరండాలోనే మరోపక్కగా పడక్కుర్చీలో పడుకుని పేపరు చదువుకుంటున్న భరత్‌వాళ్ళ నాన్నగారు రాజారావు, తండ్రి వీరాంజనేయులూ ఇద్దరూ తమలోతామే నవ్వుకున్నారు. భీమయ్య ఆ పాతకాలపు బూట్లను డెబ్బైఏళ్ళుగా సరికొత్తగా ఉంచుకోవడమే కాదు, వాటిని ప్రాణంగా చూసుకోవడం వింతగానే ఉంటుంది!‘‘తాతయ్యా, ఈ బూట్ల కథాకమామిషు ఏమిటో ఇప్పటికైనా కాస్తచెప్పరాదా? పసిబిడ్డకూడా తెలుసుకోవాలనుకుంటున్నాడుకదా!’’ అన్నాడు రాజారావు పేపరుమడచి పక్కన పెట్టి భీమయ్యకేసి చూస్తూ.భీమయ్య చేస్తున్నపని ఆపి తలపైకెత్తిచూసి, కట్టుడుపళ్ళ ముసలిముఖంతో బోసినవ్వులా చిన్నగా, తమాషాగా నవ్వాడు. వందసంవత్సరాలు దాటిపోయినా ఆరోగ్యంగానే ఉన్నాడాయన. ఇంతవరకు కర్రసాయం అవసరం కూడా రాలేదు. కంటిచూపూ తగ్గలేదు. తన పనులు తనే చేసుకుంటాడు. ఎవరిసహాయమూ అవసరం లేకుండా.‘‘చెప్పండి జేజి తాతయ్యా!’’ అన్నాడు సువన్‌ ఆసక్తిగా తన లేతకళ్ళతో కుతూహలంగాచూస్తూ.