ఆషాఢ, శ్రావణ మాసాలు పోటీపడి కురిపించిన వర్షాలతో బెలగాం చెరువులు అంచులదాకా నిండిపోయిన రోజులవి. ఏ చెరువుచూసినా తామరాకులతో, తమ్మిపూలతో కనువిందు చేసేది. తపతపా అడుగులేస్తూ బాతులూ, ఒంటికాలుమీద జపంచేస్తూ కొంగలూ గట్లమీద బారులు తీరేవి. కొసంచుల్లో మిగిలిపోయిన తడిని ఉండీ ఉడిగీ దులిపేస్తూ, వచ్చీరాని వెలుగుల్లో మబ్బు చీరెల్ని ఆరబెట్టుకునేది ఆకాశం. అరవయ్యేళ్ళనాడు చెరువులే పొలాలుగా బతికిన అసిరయ్యకి వినాయకచవితీ, దసరా వచ్చాయంటే మూడు కలవపూలూ.. ఆరు తామరాకులే!
అసిరయ్య చీకటిని చుట్టుకున్నట్లు, కాటుకడబ్బా తెరిచినట్లు ఉండేవాడు. ముతక సైనుగుడ్డతో కుట్టిన చేతులబనీను వేసుకునేవాడు. మొలకి నాగులగావంచా, బొడ్లోదోపిన అగ్గిపెట్టె, చెవిలో సగంకాల్చి ఆర్పేసినచుట్టతో కనిపించేవాడు. ఆముదం రాసిన జుట్టు అణిగిమణిగి ఉండేది. పగటిపూట అసిరయ్య నవ్వితే పనువరసమీద వెలుగు పరావర్తనం చెందేది. చీకట్లో నవ్వితే రేడియం పూసినట్లుండేది.బెలగాం సెంటర్‌కి ఎగువున తూర్పువైపు అగురువీధి అవతల కటికకర్రలదడి కట్టిన గుడిసెలో ఉండేవాడు అసిరయ్య. తెల్లవారగట్లే ఏదో చెరువులో కనిపించేవాడు.
అగ్రహారం వీధి చివర ఈశ్వరుడి కోవెల చెరువు, దాని దిగువున అమ్మవారి చెరువు, ఆ రెండూ కాకపోతే బెలగాంకీ పార్వతీపురం టౌన్‌కీ మయాన వినాయకుడికోవెలచెరువు-...ఈ మూడుజలవనరులే అసిరయ్యకి ఆదాయవనరులు. జీలుగుబెండుతో చేసిన చిన్న బల్లకట్టుమీద గొంతుకిలా కూర్చొని, చేతులతో నీళ్ళను నెట్టుకుంటూ నాలుగుగట్ల మధ్యా తిరిగేవాడు. అలా తిరుగుతూ కొడవలితో చేతికందిన తామరాకుల్ని ఒడుపుగా కోస్తూ, బల్లకట్టుమీద ఓ పక్కన పెట్టుకునేవాడు. తామరాకులతోపాటు అప్పుడప్పుడు తామరతూళ్ళు కూడా కోసుకొచ్చేవాడు.అలలపై తేలుతూ, అలా చేతికందినవి కోస్తూ, సూర్యుడు కొంచెం పైకి లేచేవేళకి అసిరయ్య బెలగాంసెంటర్‌లో ఉండేవాడు. చెరువునుంచి కోసుకొచ్చిన తామరాకుల్ని తలమీద పెట్టుకుని తడితడిగా కనిపించేవాడు.సెంటర్‌ని ఆనుకుని ఉన్న శ్రీపతివారి ఇంటి అరుగుమీద వాటిని ఏరి, నారతో కట్టలు కట్టేవాడు.
ఇళ్ళు మొదలుకుని హోటళ్ళవరకు అసిరయ్యకి చాలామంది వాడకందార్లు ఉండేవారు. వాళ్ళంతా అసిరయ్య దగ్గరే తామరాకులు కొనుగోలు చేసేవారు. వానొచ్చినా, వరదొచ్చినా రోజూ తామరాకుల కట్టలు వేయాల్సిందే. ఎప్పుడూ తీసుకునే వాడకందార్లకోసం అసిరయ్య కొన్నికట్టల్ని పక్కనపెట్టి, మిగిలినవాటిని మాత్రం ఇతరులకు విక్రయించేవాడు. రెండుచేతులూ మోకాళ్ళమీద పెటుకుని ‘‘ఓ లమ్మా..’’ అని లేచినిలబడి, గట్టిగా ఊపిరి తీసుకుని, చెవిసందులోని చుట్టతీసి, అసిరయ్య వెలిగించాడూ అంటే ఆపూటకి అమ్మకాలు పూర్తయినట్లే.
అప్పుడు శ్రీపతివారి అరుగుమీద పోస్ట్ డబ్బా వేలాడదీసిన స్తంభానికి, ఆనుకుని భుజంమీద తువ్వాలుతో మొహం తుడుచుకుని చుట్టను ఆస్వాదించేవాడు. సరిగ్గా అదేసమయానికి బోడికొండ వెనకనుంచి అగ్రహారం వీధిలోకి కర్రలమోపులు అమ్మకానికి మోసుకొచ్చే కోదువాళ్ళు అక్కడ ఆగేవారు. అసిరయ్యదగ్గర అగ్గిపెట్టె తీసుకుని చుట్టల్ని వెలిగించి, తీసి అడ్డపోగతో సేదదీర్చుకునేవాళ్ళు.