‘‘నాకు ఇంకా పెద్ద చదువులు చదవాలని లేదు నాన్నా, వ్యవసాయం చేస్తాను’’అలా నా అభిప్రాయం చెబుతానని నాన్న ఊహించలేదేమో! నావైపు ఆశ్చర్యంగా చూశారు ఆయన.‘‘ఈ కాలంలో టెన్తుక్లాస్ పూర్తి చేసినవాళ్ళు సైతం ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేటు కొలువో ఏదో ఒకటి దొరకబుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక పెద్ద చదువులు చదివినవాళ్ళ గురించి చెప్పేదేముంది? ఎకాఎకిన విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. మరి నువ్వేమిట్రా ఇలా?’’
‘‘అందరూ ఒకేలా ఆలోచిస్తే ఎలా నాన్నా! వ్యవసాయం మీద ఇష్టం వల్లనే కదా, అగ్రికల్చర్‌లో ఎమ్మెస్సీ చేశాను. చిన్నప్పటినుంచీ మీరు చేస్తున్న వ్యవసాయ పనులు చూస్తూ వస్తున్నాను. నన్ను నిరుత్సాహపడకుండా ప్రోత్సహించండి’’. అన్నాను.‘‘సరే నీ ఖర్మ’’ అన్నట్టు చూశారు నాన్న నావైపు.ఆ చూపునే అనుమతిగా స్వీకరించి, హుషారుగా బయటకు కదిలాను.నా అడుగులు మా పొలం వైపే సాగాయి. మాకు ఉన్నది కేవలం రెండు ఎకరాలే. అంతా వ్యవసాయ భూమే. తాతగారి దగ్గరనుంచి నాన్నకు సంక్రమించింది అదే.
నాన్నకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. తాతగారు తను సంపాదించిన నాలుగు ఎకరాల పొలంలో వాళ్ళిద్దరికీ చెరో ఎకరం ఆడపడుచు ఆస్తిగా, పసుపుకుంకుమల క్రింద రాసిచ్చి, నాన్నకు ఇది మిగిల్చారు.నా దగ్గరికి వస్తే ఒక్కతే చెల్లెలు. ఆనవాయితీ ప్రకారం తనకూ ఎకరం భూమి ఇవ్వాలి. అప్పుడు నాకు నికరంగా మిగిలేది ఒక్క ఎకరం పొలం మాత్రమే.ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఏమంతగా లాభసాటి కాదన్నది అందరి అభిప్రాయంగా మారిపోయింది. అయినా, వ్యవసాయం మీద ఆధారపడిన రైతులందరూ వ్యవసాయమే చేస్తున్నారు.