నాకు ఆ పిల్లనిచూస్తే మబ్బుపట్టిన చంద్రుడిలాగా కనిపిస్తూ ఉంటుంది. నవ్వుతూ తుళ్ళుతూ కనిపిస్తుంది. తాతామనవరాళ్ళు చాలా ఖుషీగా ఉంటారు.ఎప్పుడూ తాతమీద ఏదో జోకు వేస్తూ ఉంటుందాపిల్ల. అతగాడు కూడా పదేపదే నవ్వుతూ ఉంటాడు. ఉదయం ఆరుగంటలకే తాతా మనవరాళ్ళ స్వరం నాకు వినిపిస్తూ ఉంటుంది.
‘‘అమ్మా చెత్తా...’’ ఒకరి వెంట ఒకరి స్వరం.మా ఆవిడ బద్ధకంగా కళ్ళు తెరచి నిద్ర లేస్తుంది. వాళ్ళూ ‘వేకప్ కాల్స్’లా కనిపిస్తూ ఉంటారు. నాకు ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్ళడమో, న్యూస్‌పేపర్ చూడ్డమో అలవాటు. మా ఆవిడ నిద్రని సూపర్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆరోజు ట్రాక్ షూ వేసుకుని వాకింగ్‌కి వెళ్ళి వచ్చాను. మా ఆవిడ ఇంకా నిద్రలేవలేదు. ‘‘ఏం చెత్త ముసలోడు, వాడి మనవరాలు రాలేదా?’’ అని అడిగాను. ‘‘ఏం?’’ అని ప్రశ్నించింది మా ఆవిడ. ‘‘నువ్వింకా నిద్రలేవక పోతేనూ...’’ అన్నాను.‘‘ఉదయాన్నే నవ్వే ఓపిక లేదు. ఆ పాలప్యాకెట్, న్యూస్ పేపర్ తెచ్చారా?’’ అడిగింది మంచం దిగకుండానే.‘‘భేషుగ్గానూ...టీ పెట్టివ్వనా’’ అడిగాను.‘‘అంత భాగ్యమా...’’ అని లేచింది. లేచి తనే టీ పెట్టి నాకు ఒక కప్పు ఇచ్చింది.
పేపర్లో తలదూరుస్తూ, న్యూస్‌లో ఫొటోవైపు చూశాను. అచ్చు ఆ పిల్లలాగే ఉంది. ఈ ఫొటోలో బొమ్మ. ‘‘మన చెత్త పిల్లలా ఉంది కదా’’ అన్నాను.‘‘కదా ఏంటి! చెత్త పిల్లే..’’ అంది. కళ్ళు నులుముకున్నాను.ఆ పిల్లకి శుభ్రంగా బట్టలు వేసి చానల్ ‘లోగో’ చేతికి ఇచ్చిన ఫొటో అది.రోజూ మురికి మురికిగా చొక్కా పైన చొక్కా వేసుకుని వచ్చేపిల్లే ఈ పిల్ల అని అర్థమైంది నాకు. మరునాడు వాకింగ్‌కి వెళ్ళడం మానేశాను. వి.ఐ.పి కోసం ఎదురుచూస్తున్నట్టు ఆ పిల్ల కోసమే ఎదురుచూశాను. యథాప్రకారం తాతామనవరాలూ వచ్చారు.