పచ్చని కొమ్మలు, పువ్వులు, కాయలున్న పళ్లచెట్టు కనిపిస్తే హర్షాతిరేకంతో మనందరం ఎంతో ముచ్చటపడతాం. ఆ చెట్టుకింద సేదదీరుతాం, ఆ పళ్ళు తింటాం. కానీ ఆ చెట్టు అడుగున భూగర్భంలోని చీకటిలో తడుముకుంటూ రాళ్లూరప్పలు దాటుతూ గాజుపెంకుల్ని ఒరుసుకుంటూ నీటిజాడలువెదకి చెట్టును గర్వంగా నిలబెడుతుంది తల్లివేరు. ఈ కథలోకూడా తాతాబామ్మలపాత్ర అదే. వారి త్యాగం వృథాకాలేదు.
‘తాతయ్యా!’మనవడు రాజా పిలుపు నీరసంగా వినిపించి అప్పటిదాకా అంధకారంలో అశాంతితో తపించి పోతున్న రామ్మూర్తిగారి మనసు రవంత శాంతించింది.‘అంటే తన మనవడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడన్నమాట’.అప్పటికి ఈ ఉపద్రవం జరిగి ఎంతసేపైందో ఆయనకు తెలియడంలేదు. కానీ బయటనుంచి సహాయం అందేలోగా మనవడిని వీలైనంతసేపు తెలివిలో ఉంచగలిగితేచాలు బ్రతికి బట్టకడతాడు.ఇంతకీ ఏం జరిగింది?మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక రామ్మూర్తి కొడుకు నాగేష్, కోడలు తపతి మేడమీదకి వెళ్లిపోయారు.ఆ మర్నాడే కాశీ వెళ్ళిపోతున్నాం కదా అని మనవడు రాజాతోను, మనవరాలు చిట్టితల్లితోను ఆఖరిసారి దాగుడు మూతలాడుకుంటున్నారు రామ్మూర్తి, భారతి.అలవాటు ప్రకారం చిట్టితల్లి పెద్ద పందిరిపట్టెమంచెం కింద దాక్కుంది.
చిట్టి కనిపిస్తున్నా రామ్మూర్తి వెతుకుతున్నట్టు నటిస్తూ మంచంకింద దూరాడు.మంచంపక్కనే బామ్మని నిలబెట్టి సెల్‌తో ఫొటో తీస్తున్న రాజా సెల్ జారిపోయినట్టుంది. కిందకి వంగడం ఆయనకు కనిపించింది, అంతే. ఆ తర్వాత పెద్ద శబ్దం.భారతి ‘భూకంపం... రాజా మంచం కిందకి ఫో’ అని అరిచి పెద్ద కేకవేసి పడిపోయింది.ఆ తర్వాత కొంచెంసేపు పెద్ద బరువులు పడుతున్న శబ్దాలు. మంచంచుట్టూ పడిపోయిన సిమెంటు దిమ్మల తాలూకుధూళి మంచంకింద కూడా వ్యాపించింది.కళ్ళముందు అంతా అంధకారం. నిశ్శబ్దం. రామ్మూర్తికి అది భూకంపంలా అనిపించలేదు.‘ఇల్లు కూలిపోయినట్టుంది.
ఎంతచెప్పినా వినకుండా ఈ మధ్యనే కోడలు పాతఇంటిమీద పై అంతస్థు వేయించింది. పాతకాలపు ఇల్లేమో బరువుకు కుంగికూలిపోయి ఉండాలి’.అయ్యో నాగేష్, కోడలు ఇప్పుడే భోజనంచేసి వెళ్లి మేడమీద పడుకున్నారు. ఏమయ్యారో?రామ్మూర్తి హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఎటూ కదలడానికి వీలులేకుండా మట్టి పెళ్ళలు... సిమెంటు, ఇనపముక్కలు....సగం బయటే ఉండిపోయిన ఆయన కుడికాలిమీద పెద్దబరువు. కాలికింద రక్తపుతడి. కానీ బలవంతాన బాధ దిగమింగుకున్నాడాయన.