‘‘అబ్బ అల్లంపచ్చడి ఎంత కారంగా ఉందో. ఇదే మా అమ్మ అయితే అమృతంలా చేసేది. చివరికి కాకరకాయకూర చేసినాకూడా చేదు అనేదే అనిపించదు. అసలు వంట చేయటం ఒక ఆర్టు’’ అన్నాడు శ్రీధరం.కుంతల మొహం చిన్నబోయింది. ఏం మాట్లాడలేదు. ఇది మొదటిసారి కాదు. రోజూ ఉండేదే. పెళ్ళయిన క్రొత్తలో కొద్దిరోజులు మొహమాటానికి ఏం ఊరుకున్నాడో. 

తరువాత నుంచీ రోజూ ఇంతే. పచ్చడిచేసినా, కూరచేసినా, పులుసుచేసినా ఏదీ నచ్చదు. అన్నిటికీ వంకలే. చివరికి మునిసిపాలిటీవాళ్ళు సరఫరాచేసే మంచినీళ్ళిచ్చినాసరే నచ్చదు. అమ్మ చేసినవీ, ఇచ్చినవే రుచి అంటాడు.పోనీ తను ఏమైనా అసహ్యంగా చేస్తుందా అంటే అదీ లేదు. తన వంటకి తల్లీ, తండ్రే కాదు, చుట్టాలు, ఇరుగుపొరుగు కూడా ఫస్ట్‌ మార్కులే వేసేవారు.‘‘కుంతల చేతివంట అద్భుతం. ఎవరు చేసుకుంటారో కానీ దంతసిరి కలవాడు’’ అని మెచ్చుకునేవారు. మరి ఇప్పుడు ఇలా అనిపించుకోవటం చాల అవమానకరంగా ఉంటోంది. అందుకే ఎంతో కష్టపడి పాతతరం, కొత్తతరం వంటలుచేసినా, పుస్తకాల్లో చదివినవి, టీ.వీల్లో చూసినవి మార్చి మార్చి రకరకాలుగా చేసిపెట్టినా నచ్చదు. రోజూ వంకలే.పోనీ భర్త ఏదో అంటున్నాడులే అనుకుంటే పిల్లాడు కూడానా. ‘‘బామ్మ భలే చేస్తుంది.

నువ్వలా చెయ్యవేం పవ్వానం (పరమాన్నం)’’ అన్నాడు ఒకసారి. వాడికి నాలుగేళ్ళు. తల కొట్టేసినట్టైంది కుంతలకి.మొగుడికీ నచ్చక, పిల్లలకీ నచ్చక ఇక ఎందుకూ తన చాకచక్యం!తమ పెళ్ళైన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఏడాదికి తను డెప్యుటేషన్‌ మీద అమెరికా వెళ్ళి పోయింది. అక్కడ పిల్లాడిని చూ‍సేవాళ్ళు ఉండరని అత్తగారు తనదగ్గరే పెట్టుకుంది వాడిని. అత్తగారు ఆ పల్లెటూరు వదిలి రారు. ఇండియా వచ్చినా ఇప్పటివరకు తనకి ఆ ఊరు వెళ్లటం కుదరలేదు. అందుకే అత్తగారి వంటరుచి చూడలేదు.