ఒక గ్రామంలో చిదానందుడనే రైతు. అతడి భార్య రూపవతి. వాళ్ళకి ఐదేళ్ల వయసు లోపు పిల్లలిద్దరు, అనారోగ్యంతో బాధపడుతున్న తలిదండ్రులు ఉన్నారు. స్వంతిల్లు, రెండెకరాల పొలం ఉన్నప్పటికీ -ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ కావడంవల్ల ఆ రైతు పేదవాడనే చెప్పాలి. అలాంటి పరిస్థితిలో ఆ గ్రామంలో రెండేళ్లపాటు వానలుపడలేదు. కరువు వచ్చింది. పంట పండకపోయినా ఇంటి ఖర్చులు తప్పవుకదా, అందుకని ఆ రైతు ఇల్లు, పొలం కూడా తాకట్టు పెట్టాల్సివచ్చింది.
చిదానందుడికి వ్యవసాయంతప్ప ఇంకేపనీ రాదు. వరుసగా రెండేళ్లు పంటలు సరిగా పండకపోవడంతో, చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఎక్కడా అప్పు పుట్టలేదు. పూటగడవని దశ వచ్చింది. దానికితోడు సరైన మందులు ఇప్పించలేకపోవడంవల్ల ఆ రైతు తలిదండ్రులు మరింత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమస్యలనుంచి ఎలా బయటపడాలా అని తలమునకలౌతున్న సమయంలో - ఒకరోజున ఆ రైతుకు డబ్బు అప్పిచ్చిన సీనయ్య, ఇల్లు తాకట్టు పెట్టుకున్న కోటయ్య, పొలం తాకట్టు పెట్టుకున్న భూషయ్య చిదానందుడి దగ్గరకు వచ్చారు. ‘‘ఇంకా ఎంతకాలం మా బాకీలు తీర్చకుండా ఉంటావు? నీకిక మూడే మూడురోజులు గడువు. ఈలోగా బాకీ తీర్చావా సరేసరి! లేదా ఉన్న నీ ఆస్తిపాస్తులన్నీ మాకప్పగించి నువ్వీ ఊరొదిలి పోవాల్సిందే’’ అని వెళ్లిపోయారు. అప్పుడు చిదానందుడికి ఏంచేయాలో తోచలేదు.
అతడికి జీవితంమీద విరక్తి పుట్టింది. ఇంట్లోవాళ్లకి చెప్పకుండా ఊరొదిలి కాళ్లు ఎటు తీసుకెడితే ఆటు నడుచుకుంటూపోయాడు.ఆ ఊరును ఆనుకుని ఓ పెద్ద అడవి ఉంది. చిదానందుడు ఆ అడవి లోపలకెళ్లి ఓ చెట్టు కింద ఆగాడు. అటూ ఇటూ చూస్తే కింద ఓ తాడు కనిపించింది. ఆ తాడుని చెట్టుకొమ్మకి తగిలించి ఉరి వేసుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఒక ముని ఆ దారినవెడుతూ ఆ దృశ్యంచూసి చటుక్కున చిదానందుణ్ణి సమీపించి, ‘‘నాయనా! ఆత్మహత్య అన్ని పాపాల్లోకీ దారుణమైనది. ఆత్మహత్య చేసుకున్నవాడు నూరు హత్యలు చేసినవాడి కంటే పాపి. బ్రతికుండగా ఏ కష్టాలొచ్చి నువ్వీ నిర్ణయం తీసుకున్నావో తెలియదు. ఇహలోకంలో కష్టాలు భరించలేక చద్దామనుకుంటే చచ్చిన తర్వాత నరకంలో కష్టాలు అంతకు లక్షింతలు ఉంటాయి’’ అన్నాడు.