కుముద చాలా విసుగ్గా చెప్పింది -‘‘ఊహల్లో ఉన్నవన్నీ చేయడం ఏ మనిషికీ సాధ్యం కాదు. ఊహించుకుంటే ఆనందం కలుగుతుందేమో కానీ, దాన్నిఅనుభవంలోకి తీసుకురావాలనుకుంటేనే కష్టంగా ఉంటుంది. అసలిలాంటి టాపిక్ మళ్ళీరావడమే నాకు ఎలర్జీగాఉంది ... ఫోన్పెట్టేయండి.’’
‘‘మనసున్న మనిషితో మాట్లాడుకుంటే ఒత్తిడి, చికాకులు తగ్గుతాయని కాల్ చేస్తున్నాను .. పదిసార్లు చేసినా నువ్వు లిఫ్ట్ చేయడంలేదు. సాటి మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదు’’ అట్నుంచి సురేష్ సంభాషణ కొనసాగించాడు.‘‘సారీ .. నాకసలు తీరిక లేదు, నాకున్న బాధ్యతలు అటువంటివి. నిజం మాట్లాడటం నా అలవాటు గనుక మీతో మాట్లాడి నన్ను నేను డిస్ట్రబ్ చేసుకోలేను.’’‘‘ఇంతగా ప్రేమించే నన్ను నమ్మడం లేదు. నేనేమీ ద్రోహం చేయను. హృదయం అందంగా ఉన్నవారి సాంగత్యం శాంతినిస్తుంది. సౌఖ్యాన్నిస్తుంది. అందుకే ఎన్నేళ్లయినా నిన్ను వొదులుకోవాలని అనిపించడం లేదు. పైగా నీకున్న బాధ్యతలన్నీ తీరిపోయాయి. నీ జీవితానికో మంచి దారి ఏర్పరచుకుంటే తప్పేంటి?’’‘‘స్నేహంలో స్నేహమే ఉండాలి. కొండొకచో .. ప్రేమ కూడా కలిసి ఉండవచ్చు.
కానీ .. ఆ ప్రేమని శారీరక సంబంధాల మధ్య ముగించడమే మంచిది కాదని నేనూ చెబుతున్నాను .. అర్ధం చేసుకోలేకపోవడానికి మీదేం మట్టిబుర్ర కాదుగా.’’‘‘అన్ని పుస్తకాలు చదువుతావ్, వాసన లేకుండా పువ్వు ఉండనట్లు కామం కలిగించని ప్రేమ కూడా ఉండదు. పూవుకు వాసన యెటువంటిదో ప్రేమకు కామమటువంటిది.’’‘‘ఎంతో అందంగా కనబడే గోగు పువ్వుకి వాసన ఉండదు .. అలాగే నేను కూడా అనుకో.’’‘‘పదేళ్లుగా నన్ను నీ వైపుకి లాక్కునే ఆకర్షణ అయితే ఉంది కదా ... అందుకే అడుగుతున్నాననుకో.’’‘‘ఇక ఆపండి. ఎవరైనా వింటే, ఏదో నాటకానికి మనిద్దరం కలిసి రిహార్సల్స్ చేస్తున్నాం అనుకుంటారు ... అంత నాటకీయంగా ఉంది మనిద్దరి మధ్య నడుస్తున్న ఈ సంభాషణ .. నిజం చెబుతున్నాను. నీతో కలిసి జీవించాలనే స్పృహ నాకు లేదు .. ఇక మాట్లాడటం వేస్ట్. ఫోన్ పెట్టేయండి’’ కోపంగా ఫోన్ కట్ చేసింది కుముద.