పూజాదికాలు ముగించుకుని, పంచపాత్రలోనీళ్ళు తులసికోటలో పోయటానికి పెరట్లోకి వచ్చాడు సీతారామయ్య. వాయువ్యంలో రెండడుగుల ఎత్తున నిలబడ్డ వేపమోడు అతనికేసి దీనంగా చూసింది. రెండురోజులైంది చిన్నయ్య ఆ చెట్టు కొట్టించేసి. పెరట్లో ఆ భాగమంతా బోసిపోయి బావురుమంటోంది.

‘‘చల్లగాలినీ, నీడనీ ఇచ్చే ఆ చెట్టుని కొట్టించవద్దని ఎంత వారించినా విన్నాడుకాడు’’ గొణుక్కున్నాడు సీతారామయ్య. అంతలోనే అతనికి పేలవమైన నవ్వొకటి వచ్చింది. ‘నేను చెబితే వాడు వినటం! అలాంటి ఊహరావటమే తెలివి తక్కువతనం కాదూ! ఇవాళ యీ చెట్టు వంతు, రేపు..? తనకి మాత్రం అంతకన్నా సద్గతి పడుతుందా!’లోపలికి వచ్చి, తన గదిలో కూర్చున్నాడు. ‘అనువుగానిచోట అధికులమనరాదు’‘అనువుగానిచోటు అనే విషయం తెలిసింది ఈ మధ్యనేకదా. చోటు ఎన్నుకున్నప్పుడు అనువైనదనే కదా అనుకున్నది!’నిట్టూర్చాడు.నిండా ఏడాది కాలేదు సీతారామయ్య చిన్నయ్య పంచన చేరి.

చిన్నయ్య ఎవరో కాదు, స్వంత అన్నగారి కొడుకు. ఉద్యోగం పేరుతో చిన్నయ్య పట్నం చేరాడుగానీ, వాళ్లది పల్లెలో ఉమ్మడికుటుంబమే. అన్నగారు బలరామయ్యమాట సీతారామయ్యకి సుగ్రీవాజ్ఞ. బలరామయ్య కూడా తమ్ముడిని స్వంత తండ్రిలాగా పెంచాడు. అదీ వారి అనుబంధం.ఉన్న పదెకరాల పొలాన్నీ అన్నగారే సాగుచేసేవాడు. సీతారామయ్య చదువులోపడి, పట్టభద్రుడై, ఆ ఊరిలోనే బడిపంతులుగా ఉద్యోగం చేపట్టాడు.

బలరామయ్యకి ఇద్దరు ఆడపిల్లల తర్వాత, చిన్నయ్య ఒక్కడే మగసంతానం. సీతారామయ్యకి పెళ్లయిన పదేళ్లదాకా సంతానమే లేదు. అన్నగారి పిల్లలనే అతనూ, అతని భార్యా స్వంతపిల్లలనుకుని గారాబం చేసేవారు.పదేళ్ల తరవాత గర్భం దాల్చిన సీతారామయ్య భార్య కానుపు కష్టమై, శిశువుతోసహా చెయ్యి దాటిపోయింది.బలరామయ్య ఓదార్పుతో మనిషిగానిలబడ్డా, మళ్లీ పెళ్ళిమాత్రం తలపెట్టలేదు సీతారామయ్య. బలరామయ్య కూతుళ్లిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అత్తవారిళ్లకి తరలిపోయారు. చిన్నయ్య ఉద్యోగస్థుడై ఊరు విడిచాడు.