నాయనమ్మ గడ్డి తెచ్చి పంచలో పడేసింది.నులక మంచం మీద బూరుగు దూది పరుపు మీద అమ్మ వడిలో ముడుచుకుని పడుకున్నట్టు పడుకున్న చిన్నోడు కదిలాడు ఆ చప్పుడుకి. చాలా సేపటినుంచే మెలుకువగా వున్నాడు. చలికి దుప్పటి నిండా కప్పుకుని ముడుక్కుని పడుకున్నాడు.

సంక్రాంతి నెల అయితే అమ్మ ముగ్గేసే వేళకి లేచేవాడు. వాకిట్లో కసువు చిమ్మి, వైనాలు వైనాలుగా కళ్ళాపి చల్లి, అమ్మ ముగ్గేస్తుంటే ముంగాళ్ళ మీద కూర్చుని చూడటం ఇష్టం చిన్నోడికి. ఇంట్లో పూసిన ముద్దమందారం, ముద్ద బంతి, కారబ్బంతి, చంద్రకాంత పూలు కోసుకొచ్చి అమ్మకిస్తే, అమ్మ గొబ్బెమ్మల్లో పెట్టేది. అమ్మ ఇంట్లోకి వెళ్ళినా వాడు అక్కడే కూర్చుని తెల్లటి ముగ్గు మీద గొబ్బెమ్మల్లో పెట్టిన పసుపు పచ్చటి ముద్దబంతులు, ఎర్రుపు పసుపు రంగుల్లోని కారబ్బంతిని, వాటి మధ్యలో బుజ్జిగా క్రిమషన్‌ రంగులో తొంగి చూసే చంద్రకాంత పువ్వులని చూస్తూ కూర్చునే వాడు అమ్మ పిలిచిందాకా.ఇప్పుడు గొబ్బెమ్మలు పెట్టే పనిలేదు. అందుకని పడుకుని వున్నాడు.‘‘నీకు చెప్పే వుంటాడు. నంగనాచివి, దాపెట్టావు. అక్కా, తమ్ముడూ ఎప్పుడూ గుస గుస లాడుకుంటానే వుంటారు’’ నాయనమ్మ అమ్మతో అంది.

చిన్నోడు కొద్దిగా కళ్ళు తెరిచి రెప్పల చాటునుంచి చూసాడు.ఎత్తు పళ్ళు, వంకర కాళ్ళు, మోటుగా మోకాళ్ళ పైకి చీర కట్టుకుని బొత్తిగా నాగరికం తెలియదు అని దొంగచాటుగా అమ్మ తిట్టుకునే నల్లటి నాయనమ్మ కనబడింది. కళ్ళు మూసుకున్నాడు. అమ్మని ఎప్పుడూ ఏదో ఒకటి అంటుందని నాయనమ్మ అంటే చిన్నోడికి అప్పుడప్పుడు కొద్దిగా ఇష్టం వుండదు. నాయనమ్మ దగ్గరకు పోడు. నాయనమ్మకి ముద్దొచ్చి ఎత్తుకోబోయినా జారిపోయి దొరక్కుండా పరిగెత్తుతాడు.‘‘నాకు తెలవదు అత్తా .. ఇందాకే నేను చూసింది కూడా’’ అమ్మ నెమ్మదిగా చెప్పింది నాయనమ్మతో.

‘‘ఆ బాసేలిది ఏ ఊరంట?’’‘‘ఇంకా నేను పోయిరాలేదు, సంకటి వండిపోతా’’ అమ్మ చెప్పింది.చిన్నోడు కళ్ళు తెరిచి చూసాడు. కూటింట్లోకి పోతా అమ్మ కనబడింది. అమ్మ కొద్దిగా చదువుకుంది. చీర అందంగా కట్టుకుంటుంది. నెమ్మదిగా మాట్లాడుతుంది. పుస్తకాలు చదువుతుంది. అమ్మ పనంతా అయిన తరువాత మంచం మీద పడుకుని పుస్తకాలు చదువుతుంటే, తలాపిన నేల మీద కూర్చుని చిన్నోడు కూడా కూడబలుక్కుని చదువుతాడు. వాడు మూడో తరగతి చదువుతున్నా, చదవటం బాగానే వచ్చింది.