సాక్షాత్తూ ఆయనో జిల్లాకు ఎస్పీ. ఓరోజు పూటుగా తాగి రాత్రివేళ ఇంటికి చేరుకున్నాడు. భార్య గుమ్మం దగ్గరే ప్రత్యక్షమై చీపురుకట్టతో ఎస్పీగారికి బడితెపూజ చేసింది. అదంతా తలుపుచాటు నుంచి చూసిన ఆర్డర్లీ కానిస్టేబులు కడుపుబ్బనవ్వుకుని అదంతా కడుపులోనే దాచేసుకున్నాడు. ఎందుకంటే ఎస్పీగారు కదా! కానీ తర్వాత ఆయన ప్లేసులో మరో ఎస్పీగారు వచ్చాక ఏం జరిగిందంటే.....

‘‘మనమందరం రోజంతా హాయిగా నవ్వుతూ ఆహ్లాదంగా ఉండాలి. నవ్వటం ద్వారా దవడ కండరాలకు మరింత పటిష్టత పెరిగి, తద్వారా ముఖవర్ఛస్సు ఇనుమడించటంతోబాటు, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. నవ్వడం ఓ భోగం! నవ్వక పోవడం ఓ రోగం!! తనివి తీరా నవ్వితే మనసు తేలికపడి హాయిగా ఉంటుంది. అందువలన ప్రియమైన పోలీస్‌ సోదరులారా‌! మీరు అన్నివేళలా నవ్వుతూనే ఉండాలి. మీ నవ్వుల్ని మీ క్లైంట్లకీ, ఇంకా మీ కుటుంబ సభ్యులకు కూడా పంచాలి. ఆ గొప్ప ఉద్దేశ్యంతోనే మీ ఎస్పీగారు ప్రత్యేకంగా ఈ కామెడీ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. ఇదొక సరికొత్త ప్రయోగం! ఈ సమావేశానికి హాజరైన ‘ఏ ఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు....’ మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం! మీరందరూ ఈ నవ్వుల విందులో పాల్గొని మీ మీ చతురోక్తులు, హాస్యోక్తులు వినిపించి ఈ వర్క్‌షాప్‌ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ స్వాగతోపన్యాసం ముగించి, తన పక్కనే వేదికపై ఆశీనుడైన జిల్లా ఎస్పీగారికి హ్యాండ్‌మైక్‌ అందించాడు, కొత్తగా పొరుగుసేవల ద్వారా నియమితుడైన కామెడీ కన్సల్టెంట్‌ కామాక్షీరావ్‌!సభలో పోలీసు ఉద్యోగులందరూ క్రమశిక్షణ పాటిస్తూ, మితంగా చప్పట్లు కొట్టారు.

ఎందుకంటే, తమ బాస్‌ మాట్లాడాక ఎలాగూ చాలాసేపు చప్పట్లు కొట్టక తప్పదు మరి!!‘‘ప్రియమిత్రులారా! ఈ మూడుగంటల ‘కామెడీ వర్క్‌షాప్‌’ ఉద్దేశాన్ని క్లుప్తంగా, చక్కగా వివరించారు కామాక్షీరావ్‌గారు. శాంతిభద్రతలు కాపాడే మన పోలీసువ్యవస్థకు అంటే, మనందరికీ ఎన్నో బాధ్యతలున్నాయి. సిటీలో అయినా ఏజన్సీలో అయినా, ఎండనకా, వాననకా, పగలనకా రాత్రనకా మీరందరూ ఎంతో అంకితభావంతో కష్టపడి మీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో అలసిపోతున్నారు కూడా! అదే పనిగా వృత్తిలో మునిగిపోతే, జీవితం మొనాటనస్‌గా తయారవుతుంది. ఆ ‘మొనాటనీ’ తగ్గించి, తిరిగి మనకు శక్తినిచ్చే దివ్య ఔషధమే కామెడీ! అందుకే, ఇక నుండీ ప్రతినెలా ఒకటో తేదీని ‘కామెడీ డే’గా పరిగణించి, పొద్దుట పది నుండీ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ‘కామెడీ వర్క్‌షాప్‌’ కండక్ట్‌ చేయదల్చుకున్నాం. దీని తర్వాత మీ అందరికీ స్పెషల్‌ లంచ్‌ ఉంటుంది! మనందరం మన మన హోదాలు మరిచిపోయి హాయిగా జోక్స్‌ చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ, మన శక్తియుక్తులను రీచార్జ్‌ చేసుకుందాం’’ అంటూ ఎస్పీగారు ప్రసంగం ముగించగానే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది!