సుగుణాకర్‌రావు ప్రయాణానికి సిద్ధం అవుతుంటే భార్య అరుంధతి అడిగింది.‘‘మళ్లీ ఎప్పుడొస్తారు?’’‘‘అన్నయ్య ఆరోగ్యం కుదుటపడ్డాక...’’‘‘కుదుటపడ్డమా?’’ ఆశ్చర్యంగా చూసింది అరుంధతి.‘‘నా ఉద్దేశ్యం తనిక తిరిగి లేచే పరిస్థితి ఉందా అని?’’‘‘ఉండాలనే మనం కోరుకోవాలిగా...’’ అన్నాడు. అరుంధతి మరిక మాట్లాడలేదు. సూర్యుడు అస్తమిస్తాడనంగా సుగుణాకర్‌రావు అన్నయ్య నివాసం ఉండే రామగిరిలో దిగాడు. తమ్ముణ్ణి చూసి అన్నయ్య ముఖం వెలిగిపోయింది.

‘‘వచ్చావా సుగుణా....’’‘‘వచ్చాను అన్నయ్యా...’’. ‘‘సుమతీ... తమ్ముడికి నీళ్ళివ్వు...’’ ‘‘వద్దు వదినా...’’ అన్నాడు సుగుణాకర్‌రావు. ‘‘వాడు... అలాగే అంటాడు తీసుకురావే..’’ చెప్పాడు రామచంద్రం.‘‘లేదన్నయ్యా, ఈ ఎండకి ఊళ్ళో దిగిన వెంటనే రెండు కొబ్బరి బోండాలు కొట్టించి తాగాను’’.‘‘అవునా...’’ అన్నట్టు చూశాడు రామచంద్రం.అన్నకు దగ్గరగా కుర్చీ లాక్కుని, ‘‘నువ్వేం దిగులుపడకు అన్నయ్యా.... ఆపరేషన్‌ చేయిద్దాం..’’ అన్నాడు. తమ్ముడివంక ఎగాదిగా చూశాడు. ‘‘అరుణ్‌ చెప్పాడన్నయ్యా...’’ అన్నాడు.రామచంద్రం ముఖం ఆరిపోయింది. ‘‘వాడేదో క్యాజువల్‌గా సమాచారం చెప్పిఉంటాడు...’’.‘‘లేదన్నయ్యా వాడు సిన్సియర్‌గానే చెప్పాడు. నాన్నకు ఆపరేషన్‌ చేయించాలి బాబాయ్‌, మాకు భయంగా ఉంది. నీ హెల్ప్‌ కావాలన్నాడు. అది నా బాధ్యతరా, వర్రీ కాకండని చెప్పాను’’ అన్నాడు సుగుణాకర్‌రావు.‘‘మరి వాడూ, వాళ్ళన్నయ్య ఆ బాధ్యత తీసుకోక, నీకెందుకు చెప్పినట్టురా’’ కోపంగా అన్నాడు రామచంద్రం.

‘‘వాళ్లు నాకేం అప్పచెప్పలేదన్నయ్యా, నన్ను చూడాలన్న నీ కోరికని నాకు చెప్పారు అంతే. విషయం తరిచి అడిగితే, నీకు ఈ మధ్య హార్ట్‌ అటాక్‌ వచ్చిన విషయం, యాంజియోగ్రాం చేయించిన విషయం చెప్పారు’’.రామచంద్రం కాసేపు ఏమీ మాట్లాడలేదు. ‘బాబాయ్‌ చూడ్డానికి వస్తున్నాడు’ అని అరుణ్‌ చెప్పాడుగానీ తన మొత్తం పరిస్థితిని తమ్ముడికి చెబుతాడనుకోలేదు. అలా చెప్పడం తనకు ఇష్టంలేదు. ఎవరి సమస్యలు వాళ్లకి ఉంటాయ్‌. పైగా తమ్ముడి కుటుంబానికి తను చేసింది కూడా ఏమీలేదు. ‘‘సర్లే, ముందు లేచివెళ్లి స్నానం చెయ్యి’’ అన్నాడు తమ్ముడితో.సుగుణాకర్‌రావు లేచి తలుపుదగ్గరగా వేసి, తన బ్యాగ్‌లో ఉన్న డబ్బు తీసి అన్న పడుకున్న బెడ్‌మీద పెట్టాడు.‘‘పది లక్షలు అన్నయ్యా, ఆపరేషన్‌కి ఇంకా కావలిస్తే మరో ఐదులక్షలు మా చిన్నోడు సర్దుతాడు’’ అన్నాడు. దిగ్భ్రాంతిగా చూశాడు రామచంద్రం. పిల్లలు చెబితే ఏదో లక్షో యాభైవేలో సాయం చేస్తాడనుకుంటే పదిలక్షలు తేవడం చూసి నోరెళ్ళబెట్టాడు.