రోజు రోజుకీ బాస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి, ఇంక్రిమెంటు ఫైలుమీద సంతకం పెట్టాలంటే ఐదు బాటిల్స్ నీళ్ళు లంచం అడుగుతున్నాడట చెప్పారు కొలీగ్స్. ఇది రోజూ తంతేకదా అనుకుని ఇంటికెళ్ళాడతను. పక్కిండి పరమేశం వచ్చి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. తన భార్య బకెట్‌నీళ్ళు తెచ్చివ్వమంటోందట. ఎలా చచ్చేదీ అంటున్నాడు. అంతలో అందరూ బిందెలు తీసుకుని రైల్వే ట్రాక్ దగ్గరకు పరుగెత్తడం ప్రారంభించారు. అక్కడ ఏం జరిగిందంటే....
*****************************
ఉదయాన్నే కాలింగ్‌బెల్ శబ్దం విని ‘‘అప్పుడే ఎవరొచ్చార్రా బాబూ....’’ అనుకుంటూ లేచాడు వామనరావు. కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా పక్కింటి శంభులింగం!‘‘ఏమిటి సంగతి..?’’ విసుగు కనిపించనివ్వకుండా అడిగాడు వామనరావు.‘‘అదేసార్, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఒక్కసారికి ఒక్కటిచ్చారంటే మీ మేలు మరచిపోను. రెండ్రోజుల్లో మీ అప్పు తీర్చేస్తాను...’’ వెనక దాచినదాన్ని ముందుకుతీసి చూపెడుతూ అడిగాడు శంభులింగం.‘‘అదేంటండీ, మొన్నేకదా అర్జెంటంటే ఒకటిచ్చాను. మళ్ళీనా...? మాక్కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మీరిలా అడిగితే...’’ అంటూ ఇంకేదో అనబోతుండగా ‘‘బాబ్బాబూ, ఈ ఒక్కసారికీ కాదనకండి. నిన్ననే చుట్టం ఒకడు తగలడ్డాడు. దాంతో మరీ ఇబ్బందైపోయింది. ఈ రోజు వెళ్ళపోతాళ్ళెండి. ఈ ఒక్కసారికీ కాదనకండి’’ కాళ్ళా వేళ్ళా పడటం మొదలెట్టాడు శంభులింగం.‘‘మరీ మొహమాటపెట్టేస్తున్నారండి...’’ విసుక్కుంటూ కావలసింది ఇచ్చి పంపాడు వామనరావు.
మనవడి నిర్వాకాన్ని నాయనమ్మ సావిత్రమ్మ చూడనే చూసింది.‘‘ఏవిట్రా అది? నీకసలు కిందా మీదా తెలీడం లేదు. మనవేమన్నా జమీందార్లమనుకున్నావా? ఇలాగైతే తొందర్లోనే అడుక్కుతినే పరిస్థితి వస్తుంది...’’ కసురుకున్నట్టు అంది. పట్నంలో తనకూ, భార్యకూ తోడుగా ఉంటుందని నాయనమ్మను తన దగ్గరే పెట్టుకున్నాడు వామనరావు.‘‘ఏం జరిగింది..?’’ అప్పుడే హాల్లోకి వచ్చిన రమ అడిగింది.‘‘ఏం జరగడమేమిటి? నీ మొగుడేం చేశాడో తెలుసా? మళ్ళీ బాటిల్‌తో నీళ్ళు ఆ పక్కింటి శంభులింగానికి ధారపోశాడు’’ చెప్పింది సావిత్రమ్మ.‘‘అయ్యో! అయ్యో! అదేంపనండీ..? ఉన్న నీళ్ళనే పొదుపుగా వాడుకుంటున్నాం. బాటిల్ నీళ్ళంటే తక్కువా? మరీ ఇలా తయారయ్యారేవిటండీ? పెళ్ళాం బిడ్డల్ని బికారుల్ని చేద్దామనుకుంటున్నారా ఏవిటి? ఎంత రేటిచ్చి నీళ్ళు కొనుక్కుంటున్నామో మరచిపోయారా?’’ అంటూ మొదలెట్టింది రమ.