యువరాజు చండుడు మహారాజుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజ్యంలో బాణాసంచా కాలుస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు. గీతాలు ఆలపిస్తున్నారు. సభామండపం సంగతి చెప్పనవసరం లేదు. కిక్కిరిసి పోయి ఉంది. మంత్రి సామంతులూ, నగర ప్రముఖులూ చండుని రాకకోసం వేచి చూస్తున్నారు. మంగళవాద్యాలు మిన్ను ముట్టాయి. అత్తరు, పన్నీరు వర్షంలా కురిశాయి. చండుడు సభామండపంలోనికి ప్రవేశించాడు. ఆస్థాన పురోహితుడు మంత్రోచ్చారణ చేశాడు. శుభం పలికాడు. భగవద్గీతను చండునికి అందజేసి, పట్టుకుని ప్రమాణం చేయమన్నాడు. వల్లె వేయమన్నాడిలా.
శ్లో. అనన్యా శ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్.
మరి ఏ ఇతర కోరికలూ లేక ఎవరైతే నన్నే శరణు వేడుతారో, నన్నే ఆరాధిస్తారో అలాంటి స్థిరచిత్తులైన వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.పురోహితుడు చెప్పిన మాటలను చండుడు వల్లె వేయలేదు సరికదా, అతన్ని కోపంగా చూస్తూ అడి గాడిలా.‘‘ఈ మాటలు నేను నా ప్రజలకు చెబుతున్నట్టా? లేక గీతాచార్యుడు నాకు చెబుతున్నట్టా?’’‘‘తమరు ఎలా అర్థం చేసుకుంటే అలాగే మహారాజా’’ అన్నాడు పురోహితుడు.‘‘అర్థం పర్థం లేని ఇలాంటి ప్రవచనాల మీద ప్రమాణం చెయ్యడం నాకిష్టం లేదు. నేను చెయ్యను.’’ అన్నాడు చండుడు.‘‘చేయనంటే... తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఇది. ప్రమాణం చేసిన తర్వాతనే కిరీట ధారణ చేయాలి.’’ చెప్పలేక చెప్పలేక చెప్పాడు పురోహితుడు.‘‘ఆపండి మీ ప్రేలాపనలు.’’ అన్నాడు చండుడు. భగవద్గీతను పురోహితుని మీదికి విసిరికొట్టాడు. పురో హితుడు చేతులు జాచి అందుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే గీత నేలపాలయ్యేది.‘‘కిరీటధారణ చేయండి, అవతల వేటకు వేళ అయింది.’’ ఆదేశించాడు చండుడు. చేసేది లేక పురోహితుడు చండునికి కిరీటం పెట్టాడు. పెట్టి,‘మహారాజు చండునికీ’ అని గట్టిగా అరిచాడు. తప్పనిసరై జేజేలు పలికారు ప్రజలు. ఆనందించాడు చండుడు. గుర్రాన్ని అధిరోహించి వేటకు బయల్దేరాడు. అతన్ని అనుసరించారు భటులు.
అంతా నగర పొలిమేరలు దాటారు. అడవిలోనికి ప్రవేశించారు. ఎక్కడా ఒక్క మృగం కూడా కని పించలేదు చండునికి. వేటాడితేనేగాని, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకూడదనుకుని, వేయి కళ్ళతో వెదకసాగాడు. బంగారులేడి కనిపించిందతనికి. ఆశ్చర్యపోయాడు. బంగారులేడి ప్రస్తావన పురాణాల్లో ఉన్నట్టుగా విన్నాడు. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకున్నాడు దానిని. లేడిని వేటాడి తీరాల్సిందే అనుకున్నాడు. వెంట పడ్డాడు. లేడి అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, చండుణ్ణి ముప్పు తిప్పలు పెట్టింది. లేడిని అనుసరిస్తూ పరుగుదీయడంలో భటులకు దూరమయ్యాడు చండుడు. వారికి కనిపించకుండాపోయాడు. పరిగెత్తి పరిగెత్తి నదీతీరానికి చేరుకున్నది లేడి. చండుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూసి, లేడి నదిలోనికి ప్రవేశించి, అవతలి గట్టుకు చేరుకుంది. అక్కణ్ణుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, తీగల్లో చిక్కుకుని, బిక్కు బిక్కుమంటూ అటు ఇటు చూడసాగింది.