పెద్ద బిజినెస్‌మన్ కొడుకు.. కారులో వెళ్తుండగా కనిపించిందో కాలేజీ అమ్మాయి.. చూపు తిప్పుకోలేని ఆమె అందాన్ని మెచ్చి.. ఆమెనే ఫాలో అయ్యాడు. ఆమె వివరాలను కనుక్కున్నాడు. వెంటనే తండ్రికి చెప్పాడు.. అనుకున్నదే తడవుగా.. ఆ పేదింటి అమ్మాయి ఇంటికి పెళ్లి విషయం మాట్లాడేందుకు పెద్దలను పంపాడు. అంతా సజావుగా సాగి.. ఆ పేదింటి అమ్మాయి మహారాణి అయింది. పెద్దింటి కోడలు అయింది. కానీ ఊహించని రీతిలో మళ్లీ ఆ అమ్మాయి.. పుట్టింటికే చేరింది.. అసలు కథేంటంటే..
*****************************************
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ అందమైన అమ్మాయిని నేను. నా పేరు ప్రియంవద. ఒకసారి నావంక చూసినవాళ్ళెవ్వరూ చూపుతిప్పుకోలేరని అందరూ అనుకుంటూ ఉంటారు. నా అందంచూసి సహజంగా నాకు కూడా గర్వంగానే ఉంటుంది.కానీ ఈ మధ్యనే నన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుడిమీద నాకు కోపం వస్తోంది.అదీ ఆ అరవింద్ నన్ను ఏరికోరి పెళ్ళి చేసుకున్నప్పటినుంచీ!
నేను స్వీట్ సిక్స్‌టీన్‌లో ఉన్నప్పుడు కూడా ‘అందగత్తెను కదా’ అని నా పెళ్ళిగురించి పెద్ద పెద్ద కలలేమీ కనలేదు.సినిమాల్లో చూపించినట్టు, నవలల్లో రాసినట్టు ఏ రాకుమారుడో రెక్కలగుర్రం ఎక్కివచ్చి నా సౌందర్యానికి సమ్మోహితుడై అకస్మాత్తుగా స్వయంవరంలో నన్ను ఎత్తుకుపోతాడని ఊహల్లో తేలిపోలేదు.అయినా అచ్చం అలాగే జరిగింది.పెద్ద బిజినెస్ మాగ్నెట్ కొడుకైన అరవింద్...కాలేజ్ నుంచి ఇంటికి ఫ్రెండ్స్‌తో కలిసి వెళుతున్న నన్ను చూసి తన పడవంత పెద్దకారును యూటర్న్ చేసుకుని నన్ను ఫాలో అయ్యాడు. నా వివరాలు సేకరించాడు. మా పెద్దల దగ్గరకు రాయబారులను పంపి నన్ను పెళ్ళిపీటలవరకూ నడిపించాడు.అంతా హడావుడీగా, అకస్మాత్తుగా ‘ఇది కలా! నిజమా!’ అన్నట్టు జరిగిపోయింది.
‘కళ్యాణ ఘడియ వస్తే అలాగే క్షణాల్లో జరిగిపోతుంది’ అని మా వాళ్ళంతా మురిసిపోయారు.కానీ నాకు మాత్రం ఏ అనుభూతులు, మనసు స్పందనలులేని ఆ హడావుడీ ఆర్భాటపు పెళ్ళి ఎందుకో నచ్చలేదు. బొమ్మలపెళ్ళిలా అనిపించింది. పెళ్ళిమంటపంలో, పల్లకిలో నేను నిజంగా ఒకబొమ్మలాగే చలనంలేకుండా కూర్చున్నాను. నన్నుచూసి పెళ్ళికూతురు కుందనపుబొమ్మలా ఉంది’ అనుకున్నారట అంతా.పురోహితుడు ఏది చెబితే అది చెయ్యటంతప్ప పెళ్ళికొడుకు నా ఎదుటే నిల్చున్నా, అత్యంత సమీపంలో ఉండి ముట్టకున్నా నాకేమీ అనిపించలేదు. ఏ ఫీలింగ్‌లేని ఆ పెళ్ళి...! అదేం పెళ్ళో నాకు అర్థం కాలేదు.