దొరలగడీలో పనిపాటలతోనే పెరిగిపెద్దదైంది ఆమె. పూజగదిలో వెంకన్నబాబుకు దొరసాని చేసే పూజలు ఆమెను మంత్రముగ్ధుల్ని చేసేవి. అప్పటినుంచి తిరుపతి వెళ్ళాలని ఆమెలో కోరిక. గొడ్లచావిడిలో నోరులేని జీవాల చాకిరితోనే జీవితం తెల్లారిపోయింది. ఆమెకు అల్లుడు కూడా వచ్చాడు. జీవులసేవ తప్ప పరమాత్మ సన్నిధిని దర్శించే అవకాశం దక్కలేదు. చివరకు ఆమెకు ఏడుకొండలవాడి సాక్షాత్కారమైందా? లేదా?
**********************
‘‘గంగా! ఓ గంగా! ఎక్కడున్నవ్?’’ అంటూనే జవాబుకోసం ఏ మాత్రం ఎదురుచూడకుండా వెతుకుతూ ఇల్లంతా కలియజూసింది లక్ష్మి. ఎక్కడా కనిపించకపోవడంతో వెనుక పెరట్లోకి వచ్చింది. పశువుల పాకలో దూడకు గడ్డి వేస్తూ కనిపించింది గంగ.‘‘ఎప్పుడు జూసినా బర్రెలు, దుడ్డెల సంగతేనా, వేరే ముచ్చట్లు పట్టిచ్చుకునేది లేదా?’’ లక్ష్మి పలకరించింది.తలతిప్పి చూసి ‘‘నోరు లేని జీవాలు గద! మనం చూడకుంటే ఎవరు చూస్తరు? గీ బుజ్జి పుట్టి ఇరువై దినాలాయె! దాని తల్లి మేతకు కంచెకు బాయె! ఆకలో, దూపో సూడకుంటెట్ల?’’ అన్నది గంగ.దూడ తల నిమిరి, ఆ పక్కనే గోలెంలో నీళ్ళతో చేతులు కడుక్కుని కొంగుతో తుడుచుకుంటూ వచ్చింది.‘‘ఏ సంగతి వదినే! గిట్లొచ్చినవ్?’’ అంటూనే ఇంట్లోకి దారి తీసింది. లక్ష్మి అనుసరించింది.‘‘మా తమ్ముడు యాదగిరి యాత్రలకు బోయెతంద్కు బస్సు తీస్తున్నడు. ముప్పైమందట! నువ్వు గూడ రారాదు?’’ లక్ష్మి అడిగింది.‘‘ఈ బర్రెలు, చిన్నదుడ్డెలు, మేతా, కుడితీ ఈ పనంత వొదిలి పెట్కొని నేనెట్లొస్త? దేనికైనా పెట్టి పుట్టాలె.
ఇగ గీ బతుక్కు గిట్లెనె తియ్యి – మీరు పోయిరాండ్రి – ఎక్కడెక్కడికి పోతాన్రట?’’ కొంచెం దిగులుగా అన్నది గంగ.‘‘యాత్రల్లో తిరుపతి కూడా ఉన్నదంట. నువ్వు ఎప్పట్నుంచో అనుకోబడ్తివి కద! రారాదూ! మేం పోతున్నం!’’‘‘తిరుపతికిబోయి ఆ వెంకన్నను జూడాల్నని ఎన్నో ఏండ్ల సంది అనుకుంటుంటే అయితనే లేదు. ఆ దేవున్ని సూస్తనో సూడనో! అసలు దేనికన్న రాసిపెట్టి ఉండాలె!’’ తిరుపతి అనగానే గంగ కళ్ళల్లో కదలాడిన ఆసక్తి లక్ష్మి దృష్టిని దాటిపోలేదు.‘‘ఎప్పుడు పోదామనుకున్నా ఏదొక అడ్డమొచ్చె సూడంగ సూడంగ ఏండ్లు గడిశె! గిప్పుడేమున్నది పోకపోయెతంద్కు? కాల్లు రెక్కలాడినప్పుడే అన్ని దిక్కుల తిర్గిరావాలె! నువ్వు గూడ వస్తవని యాదగిరికి జెప్త! ఇంకవారం దినాలయినంకనే మనం పొయ్యేది! బట్టలు గిట్ల సదురుకో!’’ లక్ష్మి చనువుగా అన్నది.