జీవితంలో ప్రతి మనిషీ తప్పులు చేస్తాడు. కొందరు గుణపాఠాలు నేర్చుకుంటారు. మరికొందరు తమ తప్పులు దిద్దుకుంటారు. కానీ ఇంకొందరు రిపీటెడ్‌గా తప్పులు చేస్తూ, నిర్లక్ష్యంగా బతికేస్తూ ఉంటారు. అనుభవాల్లోంచి గుణపాఠాలు నేర్చుకున్నావారూ, మాటకు కట్టుబడినవారూ మహనీయుల్ని గుర్తుకుతెస్తారు. వారి అడుగుజాడల్లో నడిచినవారుగా మనకు శాశ్వతంగా గుర్తుండిపోతారు. ఈ కథలో కూడా అలాంటి వ్యక్తే మనకు కనిపిస్తారు.

**************************

‘‘‘నాన్నగారు రెడీనే కదా! మరి బయలుదేరుదామా?’’ ఆదిత్య మాటలకి, ‘‘ఎస్‌ నేను ఎప్పుడో రెడీ అయ్యాను. అమ్మ కూడా రెడీగా ఉంది’’ అనగానే, ‘‘ఎక్సలెంట్‌’’ అన్నాడు. అది వాడి ఊతపదం.మనవలు లాస్య, రోహన్‌ ఇద్దరూ తెగ సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు సమ్మర్‌ హాలిడేస్‌. ఏకంగా మూడునెలలు. అందుకే మా ఆవిడ అదేనండి శ్రీమతి రాధామోహన్‌గారు, అయ్యో హడావుడిలో పరిచయం చేసుకోవడం కాస్త ఆలస్యమైంది, అయ్యా! నా పేరు మోహన్‌ ఆవిడపేరు రాధ, నేను ఓ గవర్నమెంట్‌ ఆఫీస్‌లో పనిచేసి రిటైరై ఇప్పుడు ప్రస్తుతం ఒక పెద్ద యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నాను. నాకు కాస్త సాహిత్యాభిమానం మెండు. ఎక్కువగా చదువుతూ ఉంటాను. సాహిత్యసభలకి వెళుతూ ఉంటాను. పాత తరం రచయితలేకాదు, ఇప్పుడు రాస్తున్న, రచయితలు కవులు కూడా ఇష్టమే.మాకు ఒక్కడే అబ్బాయి. ఆదిత్య ఇంజనీరింగ్‌ అయ్యాక అమెరికాకి వచ్చేశాడు. వాడిలాగే మాస్టర్స్‌ చేసిన అమ్మాయి స్వాతితో పెళ్ళి జరిపించాం. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ, పిల్లలతో సంసారరథం నడిపించుకుంటున్నారు.

ఈమధ్యనే ఓ ఎస్టేట్‌హోం కొనుక్కున్నాడు. అది కూడా చూసినట్లు ఉంటుందని రమ్మన్నాడు.ఎలాగూ మీకు సెలవులేకదా, మనవలుతో కూడా గడపాలని రాధ అనడంతో నాలుగు నెలలు ఉందామని వచ్చాం. పిల్లలకి సెలవులు కూడా కావడంతో ఓ వారంరోజులు వాషింగ్టన్‌ డి.సి. ప్రోగ్రాం వేశారు మా వాళ్ళు.అక్కడ మా కోడలి అన్నయ్య ఉంటున్నాడు. అందుకే పిల్లలు గంతులేస్తున్నారు. వాళ్లతోపాటుగా నేను చాలా ఆనందపడ్డాను. వాషింగ్టన్‌ వెళడానికి. వెళ్ళేది ప్రదేశాలు చూడటానికికాదు సుమా! వివేకానందగారిని కలవడానికి.మూడేళ్ళగా ఆయన నాకు మంచిస్నేహితుడు. మొదట ముఖపుస్తక పరిచయం. తరువాత అది స్నేహంగా మారింది. ఆయన వాషింగ్టన్‌ డిసిలో ఉంటారు. అసలు ఈ మాటు నా అమెరికా ప్రయాణంలో ముఖ్యఆకర్షణ వివేకానందగారే. వయసులో నాకన్నాపెద్ద. కానీ స్నేహానికి అది అడ్డుకాదు. నాకెందుకో ఆయన మాటలు విన్నప్పటినుంచి ఆయన ఓ లోతైనవ్యక్తిగా అనిపిస్తున్నారు.