భీమాపురం గ్రామంలో జోగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడికి నా అన్నవాళ్లే కాదు, నిలువనీడ కూడా లేదు. ఊళ్లో అందరికీ ఆ పనీ ఈ పనీ చేసిపెడుతూ, వాళ్లు పెట్టింది తినేవాడు. రాత్రిపూట ఊరుచివర రావిచెట్టుకింద పడుకుని హాయిగా నిద్రపోయేవాడు. పగలంతా కష్టపడి పనిచేసేవాడేమో రాత్రిళ్లు అతడికి ఒళ్లు తెలియకుండా నిద్ర పట్టేసేది. మళ్లీ మర్నాడు ఊళ్లో సందడి మొదలయ్యేదాకా నిద్ర లేచేవాడుకాదు.
ఒకరోజు అవతలిపక్క గ్రామానికి చెందిన గోపాలుడు ఓ దూరపు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఆలస్యంగా బయల్దేరడంతో భీమాపురం చేరేసరికే బాగా చీకటి పడింది. అసలే శీతాకాలం. ఆ సమయానికే బాగా చలివేస్తోంది. ఎవరింటనైనా బసచేద్దామంటే గోపాలుడికి ఊళ్లో తెలిసినవాళ్ళెవరూ లేరు. పోనీ బాటసారినని చెప్పి ఎవరింటికైనావెళ్లి ఆశ్రయం అడుగుదామన్నా, అప్పటికే అందరూ నిద్రపోయే సమయమాయె! ఆ చలిలో ఎవరినీ నిద్రలేపడం మర్యాదగా ఉండదు. ఇలా ఆలోచిస్తూ ఊరుచివర రావిచెట్టువద్దకు చేరుకున్నాడు గోపాలుడు. అప్పుడతడికి అక్కడ నిద్రపోతున్న జోగయ్య కనిపించాడు. తోడుగా ఒక మనిషి దొరికాడని సంతోషించి దగ్గరగా వెళ్లి పలకరించబోయాడు. కానీ జోగయ్య ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు.
ఆ చలిలో అంతలా నిద్రపోతున్న జోగయ్యను చూస్తే అతడికి ఆశ్చర్యం కలిగింది.జోగయ్యకు నిద్రాభంగం కలిగించడం ఇష్టంలేక అక్కడే అలా చలికివణుకుతూ కూర్చున్నాడు. వణికించడానికి ఆ చలి ఒక్కటే చాలదన్నట్లు - అప్పుడే అతడికో పాట కూడా వినిపించింది. ఆ గొంతు సన్నగా కీచుగా వికృతంగా ఉంది. పాట పక్కనుంచే వస్తున్నట్టుంది. ఆ దరిదాపుల్లో నిద్రపోతున్న జోగయ్యతప్ప మరో మనిషి ఆ చుట్టుపక్కలలేడు. దాంతో గోపాలుడికి దయ్యాలుగుర్తుకొచ్చాయి. మరింత వణికిపోయాడు.
ఏం చేయాలో తోచక, కాసేపటికి మనసు చిక్కబట్టుకుని, జోగయ్యను పట్టుకుని కుదిపి లేపబోయాడు. జోగయ్యకి మెలకువ రాలేదు. కానీ గోపాలుడు పట్టువదలని విక్రమార్కుడిలాగా, అదేపనిగా కుదిపి కుదిపి, మెత్తంమీద జోగయ్యకు మెలకువ రప్పించాడు. మెలుకువ వచ్చాకకూడా చుట్టూ ఉన్న పరిస్ధితి అర్ధమవడానికి జోగయ్యకు కాసేప్పట్టింది. అతడు గోపాలుణ్ణి చూసి, ‘‘నువ్వెవరు? నన్నెందుకు నిద్రలేపావు?’’ అన్నాడు.