‘‘కాశ్యప్! లేరా! ఎనిమిది గంటలయింది. లేచి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దువుగాని. నాన్నగారు కూడా లేచి రెడీ అయ్యారు. మందులు వేసుకోవాలి కదా!’’పక్కమీద నుంచి ఇంకా లేవకుండా అటూ ఇటూ దొర్లుతున్న కాశ్యప్‌ను తట్టిలేపుతూ అన్నారు పార్వతిగారు.
‘‘ఉండమ్మా! ఇంకా ‘జెట్‌లాగ్’ తగ్గలేదు. నాన్నగారిని టిఫిన్ తిని, మందులు వేసేసుకోమను. నేను తర్వాత లేచి తింటాలే’’ ముసుగులోంచే సమాధానం చెప్పాడు కాశ్యప్.‘‘ఏమిటో! నువ్వూ లేవవు. అక్కడ ప్రవీణా లేవలేదు. పిల్లలిద్దరూ తాతయ్యతో కబుర్లు చెపుతున్నారు’’ తనలో తనే గొణుక్కుంటూ పిల్లలకూ, శివరామకృష్ణయ్యగారికీ టిఫిన్లు పెట్టడానికి సిద్ధమయ్యారు పార్వతి. శివరామకృష్ణయ్యగారు ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా రిటైర్ అయ్యాక, విశాఖపట్నంలో ఎం.వి.పి. కాలనీలో స్వంత ఇంట్లో సెటిలయ్యారు. కొడుకు కాశ్యప్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటాడు. కోడలు ప్రవీణ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. వాళ్ల పిల్లలు కార్తీక్, ప్రకర్ష వరుసగా ఎనిమిది, ఆరు సంవత్సరాల వయసువాళ్లు.
తాత శివరామకృష్ణయ్యగారినీ, నాయనమ్మ పార్వతమ్మగారినీ నాలుగేళ్ల క్రితం చూశారు వాళ్ళు.కాశ్యప్ తన తల్లిదండ్రుల గురించి, తన బాల్యం గురించి కథలు కథలుగా చెబుతూంటే, ఎంతో ఆశ్చర్యంగా వినేవాళ్లు. వాళ్లకు తమ తాత, నాయనమ్మలను ఎప్పుడు చూస్తామా? వాళ్లతో ఎన్నెన్ని కబుర్లు చెబుదామా? ఎప్పుడెప్పుడు వాళ్ళతో అమెరికా విశేషాలు పంచుకుందామా! అని ఎన్నో ఆశలతో, ఆనందంతో ఇండియా వచ్చిన ఆ పిల్లలకు, వీళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి, తాతయ్య చెబుతున్న కథలు, కబుర్లు వింటూ అమితమైన ఆనందాశ్చర్యాలతో మునిగిపోయారు. అందువల్ల వాళ్లకు ‘జెట్‌లాగ్’ ఉన్నా, బలవంతంగా నిద్రలేచి ఉదయమే తాత దగ్గర చేరిపోయారు. శివరామకృష్ణయ్యగారితో కబుర్లు చెబుతూ, పిల్లలిద్దరూ టిఫిన్లకు రెడీ అయిపోయారు.