ఒకానొకప్పుడు కాంభోజదేశంలోని నిర్మలాపురగ్రామంలో సారంగపాణి అనే సజ్జనుడు ఉండేవాడు. అతడు తనకున్న నాలుగెకరాలపొలాన్నీ స్వయంగా సాగుచేసుకొని ఆ వచ్చే ఆదాయంతో భార్యాబిడ్డల్ని పోషించుకోవడమే కాక అవసరంలో ఉన్నవారికి సాయపడుతూ ఉండేవాడు. పొలంపనులు లేని రోజుల్లో అతడు పదిమందికీ పురాణం చదివి వినిపించేవాడు. ఊరందరూ సారంగపాణిని మహాత్ముడని చెప్పుకునేవారు.

ఇలా ఉండగా, కొంతకాలానికి నిర్మలాపురం గ్రామాధికారి పాండురంగడి కూతురికి పెళ్ళి జరిగింది. అల్లుడు ఇల్లరికం వచ్చాడు. అతడిపేరు విలాసుడు. అతడికి అహంకారం ఎక్కువ. అల్లుడు కావడంవల్ల గ్రామాధికారి కూడా అతడికి భయపడేవాడు. గ్రామాధికారికి భయపడేవారందరూ విలాసుడికీ భయపడేవారు.విలాసుడికి నాట్యమంటే మక్కువ. అందుకని ఊళ్లోకి అతడొక నాట్యసుందరిని తీసుకొచ్చాడు. నాట్యసుందరి వారానికొకసారి నృత్యప్రదర్శన చేసేది. ఆ ప్రదర్శనకు వచ్చిన వారందరూ ఆమెకు కానుకలు ఇచ్చుకోవలసి ఉండేది. ఇలా కొంతకాలం సాగాక కొందరు వ్యక్తులు నృత్యప్రదర్శనకు రావడంలేదని విలాసుడు గ్రహించాడు. వారిలో సారంగపాణి కూడా ఉన్నాడు. విలాసుడు వారందరినీ స్వయంగా కలుసుకుని తాను నిర్వహించే నృత్యప్రదర్శనకు తప్పకుండా రమ్మని పిలిచాడు.

మిగతా అందరూ భయంకొద్దీ వెంటనే సరేనన్నారుగానీ సారంగపాణి మాత్రం తను రాలేనని ఖచ్చితంగా చెప్పేశాడు.విలాసుడికి సారంగపాణిమీద చెప్పలేనంత కోపం వచ్చింది. అతడు తన మామగారికి ఆ విషయంచెప్పి, ‘‘ఆ సారంగపాణికి మీరంటే కూడా లెక్కలేకుండా ఉన్నది. అతడి అహంకారం అణచడానికి ఏదో ఒకటి చెయ్యాలి’’ అన్నాడు. సాధారణంగా అల్లుడి మాటకు ఎదురుచెప్పని గ్రామాధికారి ఈ విషయంలో మాత్రం తను తల దూర్చాలనుకోలేదు. ఆయన అల్లుడితో, ‘‘నాయనా! నా మాట విను. ఆ సారంగపాణి కుటుంబపోషణకోసం స్వయంకృషి చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఉన్నంతలో పదిమందికీ సహాయపడతాడు. తీరికసమయంలో దైవచింతనలో గడుపుతాడు. ఆయన మహాత్ముడు. పొరపాటున మానవులమధ్య పడ్డాడు. ఆటువంటివాడితో శత్రుత్వం మంచిది కాదు’’ అని హితబోధ చేశాడు.