ఆమెకు 50 ఏళ్ల వయసు.. భర్త తాగుబోతు.. ఇద్దరు కూతుళ్లు.. ఓ కూతురికి పెళ్లయింది.. అల్లుడు కూడా తాగుబోతే.. కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని ఓ రెండిళ్లలో వంటింటి పనిచేస్తుంటుందామె. ‘నా కూతురు లండన్‌లో ఉంటుంది. ఆమె ఈ మధ్యనే ప్రసవించింది. తోడుగా ఉంటూ ఇంటి పనులు, వంట పనులు చూసుకుంటూ రెండేళ్లు అక్కడే ఉంటే రూ.10 లక్షలు ఇస్తానంటోంది.. ఇక్కడ నువ్వు జీవిత కాలం పనిచేసినా.. రూ.10లక్షలు రావు..’ అని యజమానురాలు ఆమెకు చెప్పింది.. దీంతో ఆశతో లండన్‌కు వెళ్లిందామె.. చివరకు.. 

***************************** 

 వంట చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది నరసమ్మ.బాధపడుతున్న నరసమ్మను చూసి జాలిపడ్డాను.రెండేళ్ళక్రితం గారెలు వేయిస్తున్నప్పుడు పొరపాటున గరిటె తిప్పడంలో తేడా వచ్చి, నూనె మరుగుతున్న మూకుడు బోర్లాపడడంతో నా ఒళ్ళు కాలిన దగ్గర నుండీ నరసమ్మ మా ఇంట్లో వంటపని చేస్తోంది. కాలినపుళ్ళు మానడానికి నాకు ఆరునెలలు పట్టింది. అలా నేను మంచంపట్టినప్పుడు వంటలక్కగా వచ్చిన నరసమ్మ వంటతోపాటు, నాకు సేవలు కూడా చేస్తూ నాకు ఎంతో ఆప్తురాలైంది.కాలినగాయాలు మాని నేను మామూలు మనిషినైన తర్వాత కూడా, వంట చేయాలంటే నాకు ఒకరకం భయం ఏర్పడింది. దాంతో ఇక నరసమ్మనే మా ఇంట్లో వంటపని అంతా చెయ్యమన్నాం.

నరసమ్మకు యాభై ఏళ్ళుంటాయి. మంచి పనిమంతురాలు. రుచిగా శుచిగా వంటచేయడంలో ఆరితేరింది. నిజాయితీకి మారుపేరు. చెప్పిన పని శ్రద్ధగా చేస్తుంది. రెండేళ్ళుగా మా ఇంట్లో మనిషిగా కలిసిపోయింది.భర్త త్రాగుబోతు. మాల్‌లో పనిచేస్తూ తన సంపాదనంతా తాగుడుకు తగలేసేరకం. నరసమ్మ సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది. నరసమ్మ మా ఇంట్లో కాకుండా మరో ఇంట్లో కూడా వంట చేస్తుంది.వంట చేసుకోలేని వాళ్ళకి రెగ్యులర్‌గా భోజనం క్యారేజీలు పంపుతుంది.నరసమ్మకి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురికి పెళ్ళి అయింది. అల్లుడు ఆటో నడుపుతాడు. నరసమ్మ కుటుంబం ఉంటున్న వీధిలోనే చివర ఇంట్లో పెద్దకూతురు, అల్లుడు కాపురం ఉంటున్నారు. వాళ్ళకి ఇద్దరుచిన్నపిల్లలు. రెండో కూతురు పెళ్లీడుకొచ్చింది. ఆమె పెళ్ళి చేయాలనుకుంటోంది నరసమ్మ.భర్తతోపాటు అల్లుడు కూడా త్రాగుబోతని బాధపడుతూ ఉంటుంది నరసమ్మ. వంట చేస్తూనే తన కుటుంబ విషయాలు చెప్పడం నరసమ్మ అలవాటు.