నా మనసంతా ఉద్వేగంగా ఉంది. ఆ డాక్టర్ మాటలింకా నా చెవుల్లో గింగురుమంటున్నాయి.‘‘మీరు ప్రపంచంలోనే వింతల్లో వింత. కొన్ని వందల కోట్ల జనాభాలో మీరు ప్రత్యేకం. సాధారణంగా, జెనెటిక్ డిజార్డర్‌తో పుట్టిన వాళ్లు బతకడం చాలా అరుదు. మీరు మాత్రం ఇరవై ఏళ్లకు పైబడినా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. చిన్నప్పటి నుండి దగ్గు, పడిశం తప్ప ఏ రోగాలూ మీ దరిచేరలేదంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు గనక గిన్నిస్ బుక్ వాళ్లను సంప్రదిస్తే, రెండు గుండెలుండి, ఆరోగ్యంగా బతుకుతున్న ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డుల్లోకెక్కడం ఖాయం. మీ స్వస్థతకేం ఢోకా లేదు. మందుల అవసరం ఏమాత్రం లేదు. మీకు మా శుభాకాంక్షలు.
’’స్కూల్లోగాని, కాలేజీలోగాని మొదటి స్థానం తప్ప వేరే ర్యాంక్ ఎరుగని నేను, ఇప్పుడు మరోవిధంగా నా ప్రత్యేకతను చాటుకుంటాను. ఒకటికాదు, రెండు గుండెలిచ్చే నిబ్బరంతో, జీవితంలో కొత్త అంచులు అధిరోహిస్తాను. ఇప్పుడు చేరబోతున్న కంపెనీలో, నా ప్రవృత్తి అయిన ‘చెస్’లో కూడా విజయపతాకాలు ఎగరేస్తాను.. నా కళ్లముందు ఏవేవో ఊహలు గిరికీలు కొడుతున్నాయి.‘‘సుజూ, ఏ లోకంలో ఉన్నావ్? ఎంత సేపట్నుంచి పిలుస్తున్నా, పలకడం లేదు.’’‘‘ఏం లేదమ్మా, నేను ఉద్యోగంలో చేరబోయే ముందు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు గదా.. రిపోర్టులు చూస్తున్నాను. ఆ డాక్టరు చెప్పింది వింటే నువ్వూ ఆశ్చర్యపోతావ్.’’
‘‘ఏంటో అంత వింతైన విషయం?’’‘‘నిజంగా వింతేనమ్మా. నాకు రెండు గుండెలున్నాయట. ఒకటి కుడివైపు, మరోటి ఎడమ పక్కన.’’‘‘అయ్యో! మరిప్పుడెలా? నువు మెడికల్ టెస్ట్‌లో ఫెయిలయ్యినట్టేనా?’’‘‘లేదమ్మా.. అక్కడే నువు పప్పులో కాలేశావ్. ప్రపంచంలోనే నేనొక ప్రత్యేకమైన మనిషిననీ, రెండు గుండెలున్న ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డుల్లోకెక్కడం ఖాయమన్నారు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని సర్టిఫికెట్ ఇచ్చారు. నన్ను ఉద్యోగంలోకి చేర్చుకోవడానికి ఏ అభ్యంతరం లేదని కంపెనీకి తెలిపారు.’’‘‘సరే కాని, రెండు గుండెలున్నాయంటే భయంగా ఉంది. మున్ముందు నీకు ఏ ఇబ్బందులొస్తాయోనని ఆందోళనగా ఉంది’’ అమ్మ భయం అమ్మది. నాకు మాత్రం ఏడవ స్వర్గంలో ఉన్నట్టుంది, ఆ సంగతి తెలిశాక.