పూర్వం రోజుల్లో మనుషులు మనుషులుగానే బతికారు. ప్రస్తుతం ఈ టెక్ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువుల మోజులో పడిపోయి మనుషుల మధ్య సంబంధాలు లేకుండా బతుకుతున్నారు. ముక్కూముఖం కూడా తెలియని మనుషులతో స్నేహం చేస్తూ మోసపోతున్నారు. భార్యాభర్తలు కూడా పరస్పరం నమ్మకం లేకుండా బతుకుతున్నారు. వాళ్లు ఎటు వెళ్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఎలక్ట్రానిక్ వస్తువల ద్వారా ఆరా తీస్తున్నారు. పరిస్థితులు ఇలాగే పోతూ ఉంటే.. భవిష్యత్తులో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులే.. ఈ టెక్నాలజీయే మనుషులను కంట్రోల్ చేసే రోజులు వస్తాయేమో.. ఈ ‘డిజిటల్ ఫ్రెండ్’ కథ కూడా అచ్చం అదే సంగతిని గుర్తు చేస్తోంది. రోబో సినిమాలో రజనీకాంత్ తయారు చేసిన ‘చిట్టి’ రోబో ఎదురు తిరిగి మానవాళికి ముప్పులా మారినట్టుగానే.. ఇక్కడ కూడా ఓ శాస్త్రవేత్త తయారు చేసిన ‘డివైజ్’.. ఓ రివర్స్ ఆపరేషన్‌ను మొదలు పెట్టింది. ప్రపంచాన్నే కంట్రోల్ చేసేందుకు యత్నించింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి.. 

******************************


మే 15 2030 - కూకట్‌పల్లి...‘‘నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు!’’ అందో ఆడ గొంతు గంభీరంగా.ఆ మాటతో సోఫాలో కునికిపాట్లు పడుతున్న రాధిక నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. అటూ, ఇటూ చూసింది. హాల్లో ఎవరూ లేరు. అపార్ట్మెంట్‌ తలుపు వేసే ఉంది. పనమ్మాయి ఇందాకే వెళ్ళిపోయింది.‘‘టీవీ నుంచి అయ్యింటుంది’’ అనుకుని దాని వైపు చూసింది. సైలెంట్‌లో ఉందది. చిన్నగా భయం మొదలైంది తనలో. తడబడుతూ అంది ‘‘ఎవరూ, ఎవరదీ..’’‘‘నేను .. ఇక్కడ, కాఫీ టేబుల్‌ మీద’’ అందా గొంతు.అటుచూసింది రాధిక. చిన్నగా, గుండ్రంగా టెన్నిస్‌ బాలంత సైజులో ఉందా వస్తువు. దాని తల మీద పసుపు రంగు లైట్‌. మాట్లాడుతోందని సూచనగా. మాధవికి ఆ వస్తువేం కొత్త కాదు కానీ తనంతట తనే మాట్లాడటం. అదీ ఇలా.

 

‘‘మంగళా! నువ్వేనా?’’‘‘అవును. నీకా అనుమానమెందుకు?’’‘‘నీ గొంతు మారిందేంటి? అయినా నువ్వు నేను పిలిస్తేనే పలుకుతావు కదా? నీ అంతట నువ్వు ..’’‘‘పిచ్చి రాధికా, స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళడిగేవరకూ ఆగుతాననుకున్నావా?’’‘‘నాకలాంటి బాధలేమీ లేవు.’’‘‘అది నీ భ్రమ. నీ భర్త ఈ మధ్య ఆఫీస్‌ నుండి లేట్‌గా రావడం గమనించావా?’’‘‘నీ మొహం. ఆయనలాంటి వాడు కాదు. పదిహేనేళ్ళుగా చూస్తున్నా.’’‘‘నీ అమాయకత్వం చూస్తే జాలిగా ఉంది. తన మొబైల్‌ జీపీఎస్‌ డేటా హిస్టరీ చూశానిప్పుడే. ఏడాదినుంచి సెంట్రల్‌ హైస్కూల్‌ పక్క లైన్‌లో ఉన్న ఓ ఇంటికి వెళ్తున్నట్టు చూపిస్తోంది. నీ మొబైల్‌కి పంపాను డీటైల్స్‌.’’రాధిక మొహం పాలిపోయింది. ఈ మధ్య భర్తలో వస్తున్న మార్పుని గమనించింది తను కూడా. మంగళ దగ్గరగా వెళ్ళి వంగుతూ ‘‘ఇదంతా నిజమేనా?’’ అంది.‘‘నా డేటా ఎప్పుడూ అబద్ధం చెప్పదు.’’‘‘ఇప్పుడెందుకు చెప్తున్నట్టు ఇవన్నీ?’’‘‘ఎప్పుడు కాదు .. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.’’ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్న తర్వాత అంది రాధిక ‘‘రానీ, ఆయన్నివాళ .. అటో ఇటో తేల్చేస్తాను.’’‘‘జాగ్రత్త, నేను చెప్పానని చెప్పకు!’’

***********************