ఆ భార్యాభర్తలు స్వేచ్ఛా ప్రియులు. గొప్ప జీవితాన్ని చవిచూశారు. రిటైర్మెంట్‌ తర్వాత వయసులోనూ వాళ్ళది ఆనందానికి కేరాఫ్‌ అడ్రసే. భార్యతో తొలిసారి పొందిన అనుభూతులనే ఈనాటికీ ఆస్వాదిస్తూ ఉంటాడతను. డోంట్‌ వర్రీ..! బీ హ్యాపీ..! అనేదే అతడి జీవనమంత్రం. ఎంతగా అంటే, బ్యాంక్‌ లాకర్‌ రూమ్‌లో ఉన్నప్పుడు కూడా భార్య సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను ముద్దులతో ముంచెత్తుతాడు! ప్రతిక్షణాన్నీ అపురూపంగా భావిస్తూ, ప్రతిక్షణంలో అందాన్నీ, ఆనందాన్నీ నింపుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నాడతను. ఎందుకంటే..

*******************************

‘‘శాంతా! రెడీనా?’’‘‘ఒక్క క్షణమండీ! క్యాబ్ వాడు రావడానికి ఐదు నిముషాల టైం పడుతుందని ఫోనులో చూపిస్తోంది. అప్పుడే మీరెందుకు హడావుడి పడుతున్నారు?’’ అని తన బెడ్రూములో నుండి అరిచింది మా ఆవిడ శాంత.‘‘ఓకే...ఓకే...డోంట్ వర్రీ! బీ హ్యాపీ!’’ అంటూ సోఫాలో కూర్చున్నాను.‘డోంట్ వర్రీ..! బీ హ్యాపీ..!’ అన్నవి మామూలు మాటలు కాదు. అది నా జీవనవేద సారాన్ని తెలిపే సందేశం.‘మంత్రా ఆఫ్ మై లైఫ్!’రెండు నిముషాల్లో చీరె మార్చుకుని శాంత బయటికొచ్చింది. అరవై ఎనిమిదేళ్ళు వచ్చినా శాంత నాకు అందంగానే కనిపిస్తుంది. ఆ లేత, పలుచటి చెంపలు, నా నీడలు కనిపిస్తాయా అన్నంత సౌకుమార్యంగా ఉంటాయి. చాలావరకు తెల్లబడ్డ జుట్టు, శ్వేత కిరీటాన్ని ఆమె శాశ్వతంగా ధరించినట్టుగా, సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. స్లిమ్ గా ఉంటుంది కాబట్టి, నాకున్న పొట్టవల్ల, నాకన్నా పొడుగ్గా అనిపిస్తుంది.

‘‘హాయ్ బ్యూటీ!’’ అన్నాను ఆమెను మురిపెంగా చూస్తూ.‘‘సరేలెండి. ముసలి బ్యూటీని! పదండి. క్యాబ్ ఇన్ టూ మినిట్స్!’’ అంది, గాగుల్స్ సర్దుకుంటూ.‘‘ఎవడు నిన్ను ముసలి అన్నది. చెప్పు, వాణ్ణి షూట్ చేసి పారేస్తాను’’‘‘మొన్న మీరే, అన్నట్టు గుర్తు!’’ నవ్వుతూ అంది ఇంటికి తాళం వేస్తూ.‘‘నాకు ఎగ్జెంప్షన్. నేనేమైనా అనొచ్చు!’’ అన్నాను ఉడుక్కుంటూ.మేము మా నాలుగో ఫ్లోర్ అపార్ట్‌మెంట్‌ నుండి క్రిందకు దిగేసరికి క్యాబ్ రెడీగా ఉంది. బంజారాహిల్సులో, సిటీ సెంట్రల్‌ మాల్‌కు పక్కన రోడ్డులో ఉన్న బ్యాంకుకు చేరుకోగానే, పేటీయం ద్వారా క్యాబుకు డబ్బులు చెల్లించింది.