మాధవరావు పెళ్ళి చూపుల్లోనే, ‘‘నాకు దేవుడూ, పూజల వంటి మూఢ నమ్మకాలు లేవు. మీకు ఆ నమ్మకాలున్నా నాకు అభ్యంతరం లేదు’’ అని సుధతో చెప్పేశాడు.సుధకి అతని నిజాయితీ, మాటలూ, రూపం నచ్చాయి. అతని ఉద్యోగం కూడా నచ్చిందని వేరే చెప్పక్కర్లేదు.అంతే! వారి పెళ్ళయిపోయింది. పెళ్ళి కోసమని, పూజలూ, మంత్రాలూ వగైరా సాంప్రదాయాలన్నీ భరించాడు మాధవరావు.వారి జీవితం పూజల తగవులు లేకుండా బాగానే గడిచింది. దేవుడి విషయంలో మాధవరావుకి ఆసక్తి లేదు గానీ, పెళ్ళి రోజు, పుట్టినరోజుల్లాంటి ఇతర ఫంక్షన్లకీ సుముఖుడే! ఎలాగూ పూజల విషయాలలో పూర్తిగా సమయం గడిపే మనిషి కాదు సుధ. కాబట్టి, వారి దాంపత్య జీవితం బాగానే గడిచిందని చెప్పాలి. కాలక్రమంలో కూతురూ, కొడుకూ ప్రవేశించారు వారి జీవితాల్లోకి.

*****************

ఊహ తెలిశాక, కూతురు సుమన, ‘‘అమ్మా! నేనూ నీతో పూజ చేస్తానే! నాకు పరీక్షలు దగ్గరి కొస్తున్నాయి’’ అనేది తల్లితో.కొడుకు ఆనంద్‌ మాత్రం ‘‘నాన్నా! నేనూ నీతో నాస్తిక సభలకు వస్తాను! అక్కా, అమ్మా చేసే పూజలు నాకు మూఢ నమ్మకాలుగా అనిపిస్తున్నాయి’’ అన్నాడు తండ్రితో.ఆ విధంగా, భావాలలో పిల్లలను పంచుకున్నారు వాళ్లిద్దరూ.ఆ రోజు, సుమనకు పరీక్షలు మొదలయ్యాయి. ‘‘సుమనా, తొందరగా రా! టైమవుతోంది పరీక్షకి’’ అంటూ స్కూటర్‌ కదిపాడు మాధవరావు.‘‘వచ్చేశా నాన్నా!’’ అంటూ బయటకు వచ్చిన సుమన మొహంలోకి చూశాడు.మొహం మీద కనీసం రెండు దేవుళ్ళ బొట్లు! మెడ మీద ఏదో రాసుకున్నట్టు వుంది. చేతికి ఏదో కట్టుకున్నట్టు వుంది పసుపు దారంతో, ఏవో ఆకులు కూడా కలిపి.‘‘ఏంటమ్మా, నీ మూఢ నమ్మకాలు? నువ్వు చదివితే, బాగా రాయగలవు గానీ, ఈ దేవుడి బొట్లతోనూ, నమ్మకాలతోనూ కాదు కదా?’’ అన్నాడు కాస్త సున్నితంగానే.‘‘మీరు వూరుకోండి! పరీక్షకి వెళుతున్న పిల్లని అలా కంగారు పెట్టకండి. అసలే టెన్షన్‌లో వుంది పిల్ల’’ అంది తల్లి కాస్త గట్టిగా.కూతుర్ని చూసి జాలి వేసి, ఇంకేమీ మాట్లాడకుండా బండి నడిపాడు మాధవరావు. కూతురు అన్ని పరీక్షలకూ ఒకే బట్టలు వేసుకోవడం చూసి అడిగాడు ఒక రోజు, ‘‘ఏంటమ్మా, రోజూ ఇవే బట్టలు వేసు కుంటున్నావు? కాస్త మాసిపోయాయి కూడా’’.