వాళ్ళింటి తాళం బద్దలుగొట్టి గుండిగలు, ఇత్తడి సామాను సహా ఇతర విలువైన వస్తువులు ఎత్తుకుపోయింది వాడే. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. కానీ మళ్ళీ ఆ ఇల్లు బాగుచేసే పని వాడికే అప్పగించారు. ఇంట్లో బూజులు దులిపి, చుట్టూ పెరిగిన చెట్లు కొట్టేసి, ఇంటికి రంగులు వేసే పనీ వాడిదే. రోజూవచ్చి పనిచేసెళుతున్నాడు. అంతటితో వాడిచేతివాటం ఆగలేదు. మళ్ళీ హౌస్‌ ఓనర్‌ ఉంగరం దొంగిలించాడు. అప్పుడు ఈ కథ ఎలాంటి మలుపు తిరిగిందంటే......

కాలింగ్‌ బెల్‌ మోగింది.అతనే అయ్యుంటాడనుకుని, చదువుతున్న పాత తెలుగు పుస్తకం పక్కనబెట్టి, లేచెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా నిలబడ్డ పాతికేళ్ళ కుర్రాడు ‘‘నమస్కారమండీ!’’ అన్నాడు.‘‘నమస్కారం’’ అన్నాను కళ్ళజోడు సవరించుకుని.ఎవరబ్బా?‌! ఈ మా ఊరబ్బాయి? ఎప్పుడూ చూళ్ళేదు.. అనుకుంటూ తెలిసినవాళ్ళ పోలికలకోసం అన్వేషించాయి కళ్ళు.‘ఊ.. హూ...’ ఎవరూ గుర్తుకురావడం లేదు. అయినా ఎప్పుడో ముప్పయ్యేళ్ళక్రిందట వదిలేసిన ఊరు. కొత్తదారుల్ని వెతుక్కుంటూ ప్రవాసపుటంచు చేరుకున్నాక, పలకరింపులు కరవైపోయిన యాంత్రిక జీవితానికి అలవాటుపడిపోయి అప్పుడే పదేళ్ళు దాటిపోయాయి. మొక్కుబడికి అన్నట్టు తప్పనిసరి వేడుకలకి, వీడ్కోళ్ళకి మాత్రం రెండుసార్లు ఆ ఊరికి వెళ్ళాల్సొచ్చింది.

ఎప్పుడైనా కొడుకు శరత్‌తో వెళ్దామంటే, ‘‘లక్షలు ఖర్చు బెట్టుకుని కృత్రిమ ఆప్యాయతల్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన కాలం కాదమ్మా’’ అంటాడు.నిజమే! అనిపిస్తుంది.అక్వేరియంలో చేపలా...చలికి వేడి, వేడికి చలి వంటి సాంకేతికతకు ఈ శేషజీవితం అలవాటు పడిపోయింది. రెండ్రోజులక్రితం శరత్‌ ఆఫీసు నుండి వచ్చాక ‘‘అమ్మా! ఎవరో రవిశంకరట...ఇక్కడే విప్రోలో పని చేస్తున్నాడట. మన ఊరేనట. వాళ్ళ అమ్మానాన్నలకి నువ్వూనాన్నగారూ బాగా తెలుసట. వచ్చే ఆదివారం ఒక్కసారి వచ్చి కలుస్తానన్నాడు’’ అని చెప్పాడు.‘‘ఎవరై ఉంటారబ్బా!?’’ అని అప్పట్నుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను.

ఎంతకీ జ్ఞాపకం రావటం లేదు.అరవై దాటాక జ్ఞాపకశక్తి వచ్చీపోయే వాన చినుకుల్లాగే ఉంటుంది కాబోలు.శుక్రవారం రాత్రి శరత్‌ చెప్పిన 36గంటల తర్వాత ఇప్పుడొచ్చింది అతనే అయ్యుంటాడనుకుని,‘‘రండి!’’ అని లోపలికొచ్చాను.‘‘అమ్మా! నా పేరు రవిశంకర్‌. మాది...’’ అంటూ అతను స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంటే...కొన్నేళ్ళుగా కొడుకు, కోడలుతప్ప తెలుగు మాట్లాడని ఇంట్లో స్పష్టమైన తెలుగు వినిపిస్తుంటే, చిన్నప్పుడు బళ్ళో పాడుకున్న ‘‘మాతెలుగు తల్లికీ మల్లె పూదండ...’’ పాట చెవుల్లో మార్మోగుతున్నట్టనిపించింది.