‘‘విన్నావా సుబ్బన్నా...మన సర్పంచ్ గారి కొడుకు పెద్ద డాక్టరై అమెరికా వెళ్ళాడట’’ కళ్ళింత చేసుకుని ప్రపంచవింత చెప్పినట్టు చెప్పాడు రాముడు.‘‘ఎంతైనా డబ్బున్నవాళ్ళు ఏమైనా చేస్తారు. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. సర్పంచ్ గారు పెట్టి పుట్టారు’’ అన్నాడు రమణయ్య.
‘‘ఔనౌను. ఆ కరణంగారి కొడుకుని ఎంత చదివించినా చదువే అబ్బకపోయె. చివరికి తప్పక తాతలు, తండ్రులలాగే మట్టి పిసుక్కుంటూ పొలాల్లో రెక్కలుముక్కలు చేసుకోవాల్సిన బ్రతుకైపోయె కదా?’’ చెప్పాడు సుబ్బయ్య.‘‘మరే. నా బామ్మర్ది కొడుకు కూడా పట్నంలో మంచి కాన్వెంటు చదువు చదివి, ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా చేస్తున్నాడు. అలాంటి చదువుకున్న పిల్లలవల్ల తల్లిదండ్రులకు పేరు, పరువు, మర్యాద వస్తాయి. రొమ్ము విరుచుకుని నలుగురిలో గొప్పగా చెప్పుకునే తండ్రిగా చుట్టుప్రక్కల పల్లెల్లో మనపేరు మారుమ్రోగి పోతాది’’ అన్నాడు రాముడు.‘‘మన చంద్రయ్య కూతురు కూడా టీచరై మన ప్రక్క ఊళ్ళోనే ఉద్యోగం చేస్తోందట కదా?’’ నిజమేనా అన్నట్టు అడిగాడు రమణయ్య.
‘‘ఆ...అవునంట. ఆడపిల్లకదా. ఆ మాత్రం చదువుకోవటమే గొప్ప. కానీ, ఈ కాలంలో అదంతా మామూలై పోయిందిలే. ఎంతైనా పేరు, డబ్బు కూడా సంపాదించే కొడుకులు, కూతుళ్ళుగా బాగా ఎదగాలంటే డాక్టర్లు, ఇంజనీర్లు లేదంటే పెద్దపెద్ద ఆఫీసర్లు అవ్వాల్సిందే. ఈకాలంలో వ్యవసాయం వల్ల, వ్యాపారాలవల్ల లాభం,నష్టం చూసుకుంటూ ఎంత కష్టపడినా ఫలితం దైవాధీనంగా ఉంది కదా?’’ నిట్టూర్చాడు సుబ్బయ్య.‘‘నాన్నా, భోం చేయడానికి అంతా కూర్చున్నారు. అమ్మ నిన్ను పిలుచుకు రమ్మంది’’ అంటూ వచ్చాడు సుబ్బయ్య రెండో కొడుకు సుధాకర్.సాయంత్రం పొలాలనుంచీ వచ్చి స్నానాలు ముగించాక, వీధి మొదట్లో రచ్చబండ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళంతా భోజనాలు చేయడానికి, ఇళ్ళకు వెళ్లేందుకు లేచారు.