చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది నాకు. ఆతృత అనే పదం వాడలేను. ఎందుకంటే ఆతృత అనేది అనేక కారణాల వల్ల కలుగుతుంది. ముఖ్యంగా నెగిటివ్ కారణాలే గుర్తుకు వస్తాయి.. ఆతృత అనగానే. కానీ ఆతృతకీ ఆందోళనకీ తేడా తెలుసుకోగలిగినవాళ్ళు తక్కువ మనలో.
చాలా సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్తున్నా. అదో కారణం. కానీ అసలు కారణం మా మాస్టారు ఆచార్యులు గారు. మా స్కూలుకు హెడ్మాస్టరుగా పనిచేసి రిటైరయ్యారు. మాకు లెక్కలు, ఆంగ్లము రెండూ ఆయనే బోధించారు. ఏడో తరగతినుండి పదో తరగతి వరకూ ఆయనే ఆ రెండు సబ్జెక్టులూ నేర్పించారు.ఆయనకి ప్రభుత్వం పురస్కారం ఇచ్చింది. ఆ సందర్భంగా పూర్వ విద్యార్థులూ, ప్రస్తుత విద్యార్థులూ కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనూ, హైదరాబాద్‌లో పెద్ద స్కూలు నడుపుతున్న మా అబ్బాయి గోపీ కలిసి మా ఊరికి బయలుదేరాం.గోదావరి జిల్లాలో ఆ నది పక్కన ఉండే కొవ్వూరు మా ఊరు.రాజమండ్రి ఎయిర్‌పోర్డులో దిగే సరికి మామయ్య ఎదురొచ్చాడు. చాలా ఆప్యాయంగా చేతులు పట్టుకుని ‘‘బాగా చిక్కిపోయావురా రామరాజూ’’ అన్నాడు. నిన్ననే నన్ను చూసినా, ఇవాళ కూడా అదేమాట అంటాడు మామయ్య.
చిన్నపుడు మామయ్య ఇంటికి వెళ్లినపుడల్లా ఆయన అదే మాట అంటూ ఉండటం వల్ల అది అలవాటై పోయింది.‘‘అబ్బిగాడు అచ్చు నువ్వు చిన్నపుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నాడు’’ అన్నాడు.కనీసం వాడినైనా చిక్కిపోయిన తరగతి నుంచి విముక్తుణ్ణి చేసినందుకు సంతోషించాను. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.‘‘వీడి వయసులో నువ్వు నిండు బుగ్గల్తో చక్కగా ఉండే వాడివి. అబ్బిగాడు చిక్కిపోయినట్టున్నాడు’’ అన్నాడు.నేను నవ్వుతూ కార్లో కూర్చుని ‘‘మీరు కూడా బాగా తగ్గిపోయారు మామయ్యా’’ అన్నాను.గోపిగాడు కూడా నవ్వుతూ కార్లో కూర్చున్నాడు, వాడికి ఏదో అర్ధం అయినట్టు.
మా ఊళ్ళో చదువైపోయాకా నాన్నగారు వ్యవసాయం వదిలేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బావుండటంతో హైదరాబాదుకు మారిపోయాం. అక్కడ గోల్ఫ్ క్లబ్‌లో నాన్నగారు మెంబర్‌షిప్ తీసుకున్నారు, వ్యాపార పరిచయాల కోసం. ఆయన ఎప్పుడూ ఆడింది లేదు. కానీ, నాకు అదే వ్యసనం, వ్యాపకం, ఊపిరి అయిపోయింది. చివరికి అమెచూర్ నుండి ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారాను. నా అంతంత మాత్రం చదువు అయిపోయిందనిపించాను.