కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నారు! అందులోనూ ఇప్పుడు దేనికైనా కాంపిటీషన్ మరీ ఎక్కువ. ఎడ్యుకేషన్, హెల్త్ మొదలు డ్రైవింగ్ శిక్షణవరకు ఏ వ్యాపారానిదైనా కార్పొరేట్ స్టైలే. అలాంటిచోట హంగులు, ఆర్భాటాలకే ఎక్కువ ప్రాముఖ్యం. ఈ నేపథ్యంలో పద్దెనిమిదో పుట్టినరోజు చేసుకున్న ఒక యువకుడు డ్రైవింగ్ నేర్చుకునే అర్హత సంపాదించుకున్నాడు. ఆ రోజు పొద్దున్నే వాళ్ళింట్లో ఏమైందంటే..
‘రవి ఉన్నాడా అండి?’’నా కోసం పిలుస్తూ ఎవరో తలుపు దగ్గర ఉన్నారని అమ్మ చెప్పింది.ఆ రోజు నా 18వ పుట్టినరోజు. నిన్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకచోట కలవాలని అనుకున్నాం. వచ్చింది వాళ్లేనేమో అని చూడ్డానికి వెళ్లాను.తలుపు దగ్గరికి వెళ్లి చూస్తే ఇద్దరు అంకుల్స్ ఉన్నారు.వాళ్లు ఎవరో నాకు తెలీదు. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు.‘‘రవి అంటే నువ్వేనా?’’ వాళ్లలో ఒకరు అడిగారు. అవునన్నాను.‘‘ఈ రోజుతో నువ్వు మేజర్ అవుతావు కదా?’’ ఇంకో ప్రశ్న వేశారు. మళ్లీ అవున్నాను.‘‘మేం న్యూ జెనరేషన్ టెక్నో డ్రైవింగ్ స్కూల్ నుంచి వచ్చాం’’ అన్నారు.‘‘లోపలికి రండి’’ అని పిలిచాను.లోపలికొచ్చాక, ‘‘18 నిండిన వాళ్ళకి మా దగ్గర డ్రైవింగ్ కోర్సులు ఉన్నాయి. మీ డాడీ లేరా?’’ వాళ్లలో ఇప్పటిదాకా మాట్లాడని మరొకాయన అడిగారు.వాళ్లని హాల్లో కూర్చోపెట్టి నాన్నని పిలవడానికి వెళ్లాను.
‘‘మా కాలంలో వ్యవస్థ ఎంతో బాగుండేది. ఇప్పుడంతా పాడైపోయింది. దానికి కారణం ఈ న్యూ జెనరేషన్ వాళ్లే’’ అని నాన్న ఎప్పుడూ అంటూంటారు.మా నాన్న చిన్నప్పుడు రెండు స్కూళ్లు ఉండేవట. ఒకటి ‘న్యూ కాన్సెప్ట్ హైస్కూల్’. ఇంకొకటి ‘టెక్నో జెనరేషన్ స్కూల్’.‘పిల్లలకి ర్యాంకులు తెస్తాం’ అని తల్లిదండ్రులకి మాటిచ్చి, నెరవేర్చడానికి ఒకరితో ఒకరు పోటీపడేవారట. ఒకరోజు అనుకోనిది జరిగింది. రెండుస్కూళ్లూ ఒకటైపోయి, ‘న్యూ జెనరేషన్ టెక్నో స్కూల్’ అని కొత్త స్కూల్ ప్రారంభించారు. ఆ రోజునుంచి వ్యవస్థ మొత్తం పూర్తిగా మారిపోయిందిట.రెండు స్కూళ్లవాళ్లూ ఒకటవగానే అన్ని రంగాల్లోనూ వాళ్లే రాణించారుట.మార్కులే జీవితమనీ, ప్రతిమనిషికీ తనకివచ్చే గ్రేడ్ని బట్టే విలువ ఇవ్వాలనీ అందర్నీ నమ్మించడానికి వాళ్లు చాలా శ్రమించారు. ఆఖరికి వాళ్ళు అనుకున్నది సాధించారు.