మన దేశంలో ఇంతటి అభివృద్ధికి కారణం కుటుంబ వ్యవస్థే అని ఎక్కడకు వెళ్ళినా ఘనంగా చెప్పుకుని గర్వపడతాం. ఒకడు లంచగొండిగా మారాడంటే కారణం కుటుంబంలోవారి దురాశ, గొంతెమ్మకోరికలే! అందుకే కాబోలు, ఈ కథలో ఒక భార్య, తన భర్తను కనీస కోరికలు తీర్చమని కూడా ఒత్తిడి చెయ్యలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన భర్త లంచగొండిగా మారకుండా చూసుకోవడం తన కర్తవ్యంగా భావించిందేమో?
‘‘రాజా, మా అంకుల్వాళ్ళ గృహప్రవేశం ఎంత గ్రాండ్‌గా జరిగిందో తెలుసా?మినిస్టర్స్, సినీ యాక్టర్స్ ఎంతమంది వచ్చారో, బిల్డింగ్ ముందు చక్కటి గార్డెన్, వెనుక స్విమ్మింగ్‌పూల్, విశాలమైన లాన్, అబ్బ చూసి తీరాల్సిందే అనుకో. మన పెళ్ళైన కొత్తలో కొన్న ఈ ఫ్లాట్ పాతబడిపోయింది. ఓ డ్యూప్లెక్స్ హౌస్ కట్టించుకుందాం, మా అంకుల్వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం. సరేనా!’’ అంటూ చెప్పిందే చెబుతూ రాజారావ్ తల తినేస్తోంది ఆశాలత.‘‘డాడ్, ఆ సంగతి సరే. ముందు నేనడిగిన కె.టి.ఎమ్ బైక్ కొనివ్వు నాన్నా, మా జూనియర్స్ ముందు నాకు తలకొట్టేసినట్టు ఉంటోంది పాతబైక్ మీద తిరగాలంటే’’.బి.టెక్ సెకెండ్ ఇయర్ చేస్తోన్న శిరీష్ రిక్వెస్ట్లాంటి ఆర్డర్ పాస్ చేస్తూ అడిగాడు తండ్రిని.‘‘డాడ్, వాడికున్న బైక్ చాలు. నేను మా ఫ్రెండ్ రమ్యతోబాటు అమెరికా వెళ్ళి ఎం.బి.యే చేస్తూ జాబ్ చేయాలనుకుంటున్నా, అన్ని ఏర్పాట్లూ మొదలెట్టాను.
నువ్వో త్రీలాక్స్ ఇస్తే, ఓ మూడు–నాలుగేళ్ళ తర్వాత నేనే డ్యూప్లెక్సేంటి, ట్రిప్లెక్స్ కట్టేస్తా, వీడికి లేటెస్ట్ ‘హార్లీ డేవిడ్సన్ బైక్’ కూడా కొనిస్తా’’ ధీమాగా అంది గారాబాల పుత్రిక అనూహ్య. పక్కగదిలో కూర్చున్న రాధమ్మకి వారందరి మాటలూ స్పష్టంగా విన్పిస్తున్నాయి. ‘కొత్తకొత్త కోరికలచిట్టా వింటున్న తన కొడుకు రాజారావ్ పరిస్థితి ఏమిటా?’ అని ఊహిస్తూ తల్లడిల్లసాగింది.‘ఎదగాలన్న అభిలాష వేరు. కానీ శక్తికి మించినవి కోరుకుంటూ ఊహల ప్రపంచంలో గాలిమేడలు కట్టడం సబబేనా? అంత అర్థంచేసుకోలేనిస్థితిలో ఉన్నారేంటి ఈ పిల్లలు?’ అనుకుంటూ గోడపై ఉన్న భర్త ఫొటోవంక చూసింది రాధమ్మ.